Baby Death: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిన్నారి మృతికి.. పోలీసులు కారణం కాదని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప చెప్పారు. మంత్రి ఉషశ్రీ చరణ్ ఊరేగింపులో ఆసుపత్రికి వెళ్లే చిన్నారిని ముందుకు వెళ్లకుండా పోలీసులు ఆపేశారనే ప్రచారం వాస్తవం కాదన్నారు. పోలీసులపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయని వివరించారు. చిన్నారి తల్లిదండ్రులను ఈ విషయంలో కావాలనే తప్పుదోవ పట్టించారని అన్నారు.
అసలేం జరిగింది..
అనంతపురం జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం.. ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. మంత్రిగా బాధ్యతలు తీసుకొని తొలిసారి నియోజకవర్గానికి వస్తున్నారని.. కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఊరేగింపు సందర్భంగా ఆ మార్గంలో పోలీసులు వాహనాలను నిలిపివేశారు. అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన ఈరక్క, గణేష్‌ల కూతురు పండు అనే 8 నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఆ వాహనం ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. ముందుకు వెళ్లేందుకు మరో మార్గం లేకపోవటంతో.. ఆ చిన్నారి మృతి చెందింది.
బాలిక మృతిపై కుటుంబసభ్యుల ఆందోళన చేపట్టారు. పోలీసులు అత్యుత్సాహంతోనే.. తమ కూతురు చనిపోయిందని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
ఇదీ చదవండి: వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా... లబ్దిదారులకు కోతలు!