అనంతపురం జిల్లా హిందూపురం మాజీఎమ్మెల్యే పామిశెట్టి రంగనాయకులు అనారోగ్యంతో మృతి చెందారు. తెదేపా ఆవిర్భావ సమయంలో హిందూపురంలో ఆయన క్రియాశీలకంగా పని చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 2004 నుంచి 2009 వరకు హిందూపురం మరోసారి ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతరం 2014లో ఆప్కో, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్గా కొనసాగారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ముందు కుమారుడి ఒత్తిడి మేరకు వైకాపాలో చేరినప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యం పాలైన రంగనాయకులు నిన్న రాత్రి మృతి చెందారు.
పరామర్శ..
రంగనాయకులు మృతిపై తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్ ఛైర్మన్గా శాసనసభ్యునిగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని చంద్రబాబు కొనియాడారు. రంగనాయకులు కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. రంగనాయకులు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఎమ్మెల్యేగా హిందూపురం అభివృద్ధికి రంగనాయకులు కృషి చేశారని బాలకృష్ణ గుర్తు చేశారు.
ఇదీ చదవండీ... TTD: శ్రీవారి ఆన్‌లైన్ టికెట్ల పెంపు యోచన లేదు: తితిదే