ELECTRIC CYCLE FOR DISABLED: అనుకోకుండా.. ఓ దివ్యాంగురాలు అనంతపురం.. టవర్ క్లాక్ సెంటర్‌లో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనను దగ్గరగా చూసిన చలించిపోయిన బాబ ఫకృద్దీన్.. దివ్యాంగుల కోసం ఏదో ఒకటి చేయాలని భావించి ఎలక్ట్రిక్ సైకిల్ తయారీపై దృష్టిపెట్టారు. తనదే చాలీచాలని సంపాదన అయినా వెనకడుగు వేయలేదు. తన ఖర్చులనే తగ్గించుకుంటూ.. సైకిల్ తయారీపై దృష్టి పెట్టాడు. పగలు కారు రిపేరు చేస్తూ రాత్రిళ్లు.. సైకిల్ తయారీకి సమయం కేటాయించేవాడు. అలా 6 నెలలు కష్టపడి, దాదాపు లక్షా 40 వేలు వెచ్చింది.. ఎలక్ట్రికల్ సైకిల్ రూపొందించాడు. దాన్ని గుంతకల్లులోని ఓ దివ్యాంగురాలికి అందించాడు. కానీ.. ఆ సైకిల్ అనుకున్నంతగా మైలేజీ ఇవ్వలేదు. దాంతో మళ్లీ మొదటికొచ్చింది. ఈ సారి మార్కెట్‌లో ఉన్న వాటి కంటే ఎక్కువ మైలేజీ ఇచ్చేలా సైకిల్ తయారీకి ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఈ సారి తన దగ్గర డబ్బులు సరిపోక.. ఇంట్లో తల్లిదండ్రుల సంపాదనా వినియోగించాడు. ప్రత్యేకంగా దివ్యాంగుల కోసమనే కాకుండా.. అందరూ వినియోగించేలా ప్రత్యేక సైకిల్ తయారీ మొదలుపెట్టాడు. ఇతని ఆలోచనకు మెచ్చి.. తమిళనాడులోని ఓ బ్యాటరీ డీలర్.. సగం ధరకే బ్యాటరీ అందించాడు. అలా 12 ఓల్టులు, 16 ఆంప్స్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని వినియోగించి.. పంజాబ్ నుంచి తెప్పించిన సైకిల్‌కు ఆ బ్యాటరీ అమర్చి విజయం సాధించాడు.
ఈ ఎలక్ట్రికల్ సైకిల్.. 90 కిలోలకు పైగా బరువు మోస్తుందంటున్న బాబ.. 3 గంటలు ఛార్జ్ చేస్తే చాలు.. చాలా దూరం ప్రయాణించవచ్చంటున్నాడు. చూసేందుకు చాలా స్టైలిష్‌గా ఉండడం, చార్జింగ్‌కు తక్కువ ఖర్చవుతుండడంతో.. చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారంటున్నాడు ఈ యువకుడు. తమకూ సైకిల్ కావాలని అడుగుతున్నారని చెబుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో.. తొమ్మిదో తరగతిలోనే బడి మానేసిన బాబ ఫకృద్దీన్.. స్థానిక మెకానిక్ షాప్‌లో చేరిపోయాడు. అక్కడ నేర్చుకున్న నైపుణ్యాలతోనే ఈ సైకిల్ రూపొందించాడు. ఈ ఎలక్ట్రికల్ సైకిల్‌ని ఇంకా వాణిజ్య పంథాలో తయారీ మొదలుపెట్టలేదని, త్వరలోనే ఆ దిశగా ప్రయత్నిస్తానని చెబుతున్నాడు.
ఇదీ చదవండి:
Vanama Raghava Land Kabza: భూ బకాసురుడు.. బయటకొస్తున్న రాఘవ ఆగడాలు