ఎలుగుబంటి దాడిలో మేకలకాపరి తీవ్ర గాయపడిన ఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేకల కాపరి వీరేశ్.. తెల్లవారుజామున స్థానిక ఆరటి తోటలో మేకల మేత కోసం వెళ్లాడు. ఈ క్రమంలో తోటలో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. వీరేశ్ కేకలు వేయడంతో సమీప పొలాల్లో ఉన్న రైతులు రావడంతో ఎలుగుబంటి అక్కనుంచి పారిపోయింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మేకల కాపరిని.. రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కనుంచి అనంతపురం తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ప్రస్తుతం వీరేశ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
సమాచారం మేరకు రాయదుర్గం అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ సమీపంలో అడవి జంతువుల సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీచదవండి: పేదలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే.. వైఎస్ఆర్ బీమా: సీఎం జగన్