TDP LEADERS HOUSE ARREST : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కసింకోట మండలానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎలాంటి నిరసనలు తెలుపకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కసింకోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మురళి, తెలుగు రైతు సంఘం నాయకులు ఉగ్గిన రమణమూర్తి, తెలుగు యువత కశింకోట మండల అధ్యక్షుడు సిద్దిరెడ్డి సూర్యనారాయణలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
నల్లబెలూన్లపై పోలీసుల ఆరా: నర్సీపట్నంలో సీఎం పర్యటన ముగిసేంత వరకు పోలీసుల అదుపులోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండాలని హుకం జారీ చేశారు. సీఎం జగన్ పర్యటన దృష్ట్యా నిరసనలు చేస్తారన్న అనుమానంతో టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు.. తాజాగా 2 రోజులుగా నర్సీపట్నంలో నల్ల బెలూన్‌లు, రిబ్బన్లు కొనుగోల్లపై ఆరా తీస్తున్నారు.
బస్సులను రద్దు చేయడంతో అవస్థలు పడుతున్న ప్రజలు: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన కోసం.. ఆర్టీసీ బస్సులు తరలించడంతో.... స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపోకి చెందిన సుమారు 100 బస్సుల్లో.. సీఎం పర్యటన కోసం 78 బస్సులు కేటాయించారు. ఈ కారణంగా.. ఈ డిపో నుంచి వివిధ మార్గాల్లో వెళ్లే బస్సులను పూర్తిగా రద్దు చేశారు. అనకాపల్లి, చోడవరం, తుని విశాఖ వంటి నిరంతర సర్వీసులను గణనీయంగా తగ్గించారు. ఫలితంగా ప్రయాణికులు.... తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది.
ఇవీ చదవండి: