Arrest: తమకు వ్యతిరేకంగా వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాడంటూ యువకుడిని కొట్టి, వేధించి అతడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన కేసులో కశింకోట మండలం కొత్తపల్లి సర్పంచి సహా ఐదుగురు వైకాపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి సర్పంచి ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ గ్రామానికి చెందిన సుదర్శనం శ్రీనివాస్ అలియాస్ శర్మ (27) తన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాడు. దీనిపై ఆగ్రహించిన సర్పంచి కన్నం శాంసన్, అతని అనుచరులు శ్రీనివాస్‌ను కొట్టారు. అతని ఉద్యోగం తీయించి, చంపేస్తామని బెదిరించడంతో శ్రీనివాస్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మృతుడి అక్క ఫిర్యాదుమేరకు కశింకోట పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన నేరంపై సర్పంచి కన్నం శాంసన్ (27), అద్దేపల్లి శ్రీనివాసరావు (47) కన్నం ప్రభుకిశోర్ (24), వేపాడ శ్రీను (19), తంటపురెడ్డి సురేష్ (24), శనివాడ ప్రేమ్‌కుమార్‌ను (20) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనకాపల్లి గ్రామీణ పోలీస్‌స్టేషన్ సీఐ జి.శ్రీనివాసరావు తెలిపారు.
అసలేం జరిగిందంటే..?
‘బాధ్యత గల సర్పంచి పదవిలో ఉంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తగదు’ అంటూ ఓ యువకుడు వాట్సప్‌లో పెట్టిన స్టేటస్ చివరకు అతని ప్రాణాలు తీసింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లిలో జరిగింది. 'కొత్తపల్లికి చెందిన సుదర్శన్ నారాయణ, శకుంతల కుమారుడు శ్రీనివాస్(26) ప్రైవేటు ఉద్యోగి. తాను సన్నిహితంగా ఉంటున్న యువతి పట్ల సర్పంచి కన్నం శ్యామ్, వైకాపా నాయకులు అద్దెపల్లి శ్రీనివాసరావు ఇటీవల అసభ్యంగా ప్రవర్తించారు. ఇదే విషయాన్ని శ్రీనివాస్ తన వాట్సప్ స్టేటస్‌లో ప్రశ్నించాడు. ఆగ్రహించిన సర్పంచి, అనుచరులు ఆదివారం శ్రీనివాస్‌ను రాళ్లతో కొట్టారు' అని అనకాపల్లి గ్రామీణ సీఐ జి.శ్రీనివాసరావు వెల్లడించారు.
సోమవారం మధ్యాహ్నం శ్రీనివాస్ తన స్నేహితులకు వాయిస్ మెసేజ్ పంపించాడు. ‘నాకు బతకాలని లేదు. సర్పంచి శ్యామ్ తనను ఇబ్బంది పెట్టారని, ఓ అమ్మాయి చెబితే, స్టేటస్ పెట్టాను. ఏ తప్పు చేశానని నన్ను కొట్టారు? అధికారం ఉంటే ఏమైనా చేస్తారా? నా చావు తర్వాతైనా నిజానిజాలు బయటకు వస్తాయి’ అంటూ అందులో వాపోయాడు. మిత్రులు ఇంటి వద్దకు వచ్చి చూడగా, అప్పటికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుపై సర్పంచి శ్యామ్, శ్రీనివాసరావు, కన్నం కిశోర్, వి.శ్రీను, ఎస్.సురేష్, ఎస్.ప్రేమ్‌లపై కేసు నమోదుచేసి, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఠాణా వద్ద మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు పరామర్శించారు. నిందితులను శిక్షించాలని, శ్రీనివాస్ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: "వేణుగోపాలకృష్ణ బీసీ శాఖ మంత్రా..? జగన్ భజన శాఖ మంత్రా..?"