AMARNATH: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని సీడ్స్ కంపెనీ దుర్ఘటనకు క్లోరిన్ వాయువే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రకటించారు. సెజ్‌లోని ఏపీఐఐసీ కార్యాలయంలో నిపుణుల కమిటీ ప్రతినిధులు, అధికారులతో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. కంపెనీలో శుక్రవారం విషవాయువు లీకవడంతో 369 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 298 మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి కాగా.. 80 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. క్లోరిన్‌తోపాటు మిగిలిన వాయువులు మిళితమైనట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారని చెప్పారు.
సీడ్స్ కంపెనీలోని ఏసీ యూనిట్ల నుంచి సేకరించిన రసాయన నమూనాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) పరిశీలనకు పంపించామన్నారు. అక్కడి నుంచి నిపుణుల నివేదిక 48 గంటల్లో రానుందని, దాని ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అస్వస్థతకు గురైన మహిళా కార్మికులకు పరిహారం చెల్లించడానికి సీడ్స్ కంపెనీ యాజమాన్యం అంగీకరించిందని, ఎంత ఇవ్వాలో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి చెప్పారు. మరో మూడు రోజులు (ఐఐసీటీ నివేదిక వచ్చే వరకు) పరిశ్రమను మూసి ఉంచాలని ఆదేశించామన్నారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఎ.కె.పరీడా, అనకాపల్లి ఎంపీ బి.వి.సత్యవతి, ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: