Jagan Government Stopped Bridges Construction Work: ఆశ, అత్యాశ, దురాశ. ఈ మూడింటికి మధ్య తేడా తెలుసా? వైసీపీ ప్రభుత్వం రోడ్లపై గుంతలు పూడ్చాలనుకోవడం ఆశ! కొత్తగా రోడ్లు వేయాలనుకోవడం అత్యాశ! రహదారుల మధ్యలో వచ్చే వంతెనలూ నిర్మించాలనుకోవడం దురాశ! అవును కూలగొట్టడం తప్ప, కట్టడం చేతగాని వైసీపీ సర్కార్ నుంచి నిర్మాణాలు ఆశించడం ప్రజల తప్పుకాక మరేంటి? రాష్ట్రంలో వందలాది వంతెనలు శిథిలావస్థకు చేరినా జగన్ సర్కార్ కొత్త నిర్మాణాల ఊసెత్తడం లేదు. మరమ్మతులు చేయించడం లేదు. కనీసం గత ప్రభుత్వం కొంతమేర చేసిన పనుల్నీ ముందుకు తీసుకెళ్లడం లేదు. అసలు గుంతలే పూడ్చలేని సర్కారు వంతెనలు పట్టించుకుంటుందా? ఇదే వాహనదారులను వేధిస్తున్న ప్రశ్న.
అనకాపల్లి జిల్లా భీమునిపట్నం-చోడవరం-నర్సీపట్నం రాష్ట్ర రహదారి వడ్డాది వద్ద పెద్దేరు నదిపై 60 ఏళ్లనాటి పాత వంతెన 2022 మే నెల్లో కుంగింది. కొత్త వంతెన నిర్మాణానికి రూ.25 కోట్ల రూపాయలు కావాలని ప్రతిపాదన పంపినా ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఈ వడ్డాది వంతెనకు సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలోని విజయ రామరాజుపేట వద్ద ఉన్న బ్రిటీష్ కాలంనాటి పాత వంతెన గత నెల 20న కుంగింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటంతో ప్రమాదకరమైన ఈ మార్గంలోనే ప్రజలు ప్రయాణిస్తున్నారు.
"ప్రజలు ఇబ్బందులు అర్థం చేసుకుని ప్రభుత్వం వంతెనలకు మరమ్మతులు నిర్వహించాలి. రోడ్లకు గుంతలు ఏర్పడటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి." -స్థానికులు
ప్రమాదకరంగా వంతెనలు - కొత్తవి నిర్మించాలంటూ స్థానికుల ఆందోళన
అనంతపురం జిల్లా కనేకల్‌లోని వందేళ్ల నాటి వంతెన నెల క్రితం కూలింది. ప్రమాదాన్ని ముందే గ్రహించిన టీడీపీ ప్రభుత్వం 2018లో కొత్త వంతెన నిర్మాణాన్ని ప్రారంభించింది. పిల్లర్ల దశ కూడా పూర్తి చేసింది. పనులు పూర్తయ్యే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చి పనులు అక్కడితో ఆపేసింది. ఈ క్రమంలో పాత వంతెన కూలింది. గుంగులాపురం, రచ్చుమర్రి నుంచి తరచూ కనేకల్ వెళ్లే రైతులు, విద్యార్థులు ప్రాణాలు పణంగా పెట్టి ఈ వంతెనపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఈ మార్గం తప్పితే 15 కిలోమీటర్ల వరకూ చుట్టూ తిరిగి రావాల్సిందేనని స్థానికులు వాపోతున్నారు.
వైసీపీ పాలకుల నిర్లక్ష్యం - నాలుగున్నరేళ్ల పాలనలో 20 శాతం పనులనూ పూర్తి చేయని ప్రభుత్వం
ఇలా శిథిలమై కూలినవి, కూలేందుకు సిద్ధంగా ఉన్నవి రాష్ట్రంలో వందలాది వంతెనలు ఉన్నాయి. జిల్లాల నుంచి రహదారులు భవనాల శాఖ సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 230 మేజర్ వంతెనలు, 503 మైనర్ వంతెనలు శిథిలమైనట్లు గుర్తించారు. వీటిపై ప్రయాణం ప్రమాదకరమని అధికారులు తేల్చారు. రాష్ట్ర, జిల్లా రహదారుల్లో 610 సబ్ కల్వర్టులు, 1370 పైప్ కల్వర్టులు, 107 కాజ్‌వేలు కూడా దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటన్నింటినీ పునర్నిర్మించాలని నివేదిక పంపినా ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేదు. జగన్ ఏలుబడిలో వివిధ తుపాన్లు, వరదల వల్ల 190 వంతెనలు దెబ్బతిన్నాయి. వీటి పునర్నిర్మాణానికి రూ.715 కోట్లు అవసరమని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. గత ప్రభుత్వంలో మంజూరైనవి, వివిధ ప్రాజెక్టుల కింద మంజూరై మధ్యలో ఆగిపోయన వంతెనలు 40 వరకూ ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు రూ.1400 కోట్ల ఖర్చు అవుతుంది. వీటికి నిధులిచ్చేందుకు జగన్ సర్కారు ముందుకు రావడంలేదు.
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(NDB) రుణంతో 3వేల100 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ, వాటి మధ్యలో ఉన్న 480 వంతెనలు పునర్నిర్మించాలనే ప్రణాళిక ఉంది. మొదటి దశలో 1244 కిలోమీటర్ల రోడ్లు, వాటిలోని 210 వంతెనల పనులకు 2021 మార్చిలో గుత్తేదారులతో ఒప్పందం జరిగింది. దాదాపు మూడేళ్లవుతున్నా 31 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. బ్యాంక్ ఇచ్చిన రుణ అడ్వాన్స్‌ను గుత్తేదారులకు ప్రభుత్వం పూర్తిగా చెల్లించకపోవడం, ప్రభుత్వ వాటా ఇవ్వకపోవడంతో గుత్తేదారులు ఎక్కడికక్కడ పనులు ఆపేశారు. మొదటి దశలోని 210 వంతెనల పనులే ప్రశ్నార్థకంగా మిగిలాయి. ఇక రెండో దశలో ప్రతిపాదించిన 270 వంతెనల పునర్‌నిర్మాణంపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త రహదారుల నిర్మాణం గురించి పూర్తిగా మరిచిపోయింది. వర్షాలకు ధ్వంసమైన రోడ్లలో గుంతలు పూడ్చటమే మహాభాగ్యం అనేలా పరిస్థితి తయారయింది.
Bridge Collapse: నిర్వహణ లోపం.. కుప్పకూలే దుస్థితికి చేరుకున్న పురాతన వంతెనలు..