Goldsmith Made Various Forms of Lord Shiva: మహాశివరాత్రి వచ్చిందంటే భక్తులు పలు రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. అనేక రూపాల్లో తమ భక్తిని చాటుకుంటారు. కొంతమంది భక్తులు రాత్రంతా జాగారం చేస్తూ.. శివనామస్మరణ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ భక్తిని తెలియజేస్తారు. కానీ ఓ భక్తుడు ఇందుకు భిన్నంగా.. తన భక్తిని చాటుకున్నాడు.
అనేక మంది భక్తులు చేసే వివిధ రకాలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భిన్నంగా అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన వైదాసు శ్రీనివాసరావు అనే స్వర్ణకారుడు తన శివ భక్తిని చాటుకున్నాడు. పసిడి, వెండి తీగలతో అనేక శివ రూపాలను చేస్తూ.. తన భక్తిని నిరూపించుకుంటున్నాడు. గత ఐదారు సంవత్సరాలుగా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ పలు రకాల శివ రూపాలను సూక్ష్మ చిత్రాలుగా తయారు చేసి అబ్బుర పరుస్తున్నాడు.
రోలుగుంటకు చెందిన వైదాసు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎంతో కాలంగా.. స్వర్ణకార వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈయన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత ఐదారు సంవత్సరాలుగా వెండి, పసిడి వంటి లోహాలతో శివ రూపాలను చిన్న సైజులలో తయారు చేయడానికి అలవాటుగా మలుచుకున్నాడు.
దీనిలో భాగంగా ఇప్పటికే శివపార్వతులు, నందీశ్వరుడు, శివలింగాలు, తదితర ఆకృతులను వెండి, బంగారు తీగలతో తయారు చేసి అందర్నీ అలరించాడు. తాజాగా ఈ ఏడాది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఆలయంలోని కాళేశ్వరుడి రూపాన్ని నాలుగు వందల మిల్లీ గ్రాముల బంగారు తీగతో రూపొందించి అబ్బురపరిచాడు. కేవలం దీన్ని ఎనిమిది గంటల వ్యవధిలోనే తయారు చేయడం విశేషం.
కేవలం శివరూపాలనే కాకుండా తాజ్ మహల్, ఈఫిల్ టవర్, సైకిల్ , ఫ్యాన్, టేబుల్ ల్యాంప్, మిక్సీ, అత్యంత సూక్ష్మ ఆకృతులను తయారు చేశాడు. చూడముచ్చటగా ఉన్న ఈ సూక్ష్మ ఆకృతులన్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పసిడి వెండి తీగలతో ప్రపంచంలోని ఏడు వింతలను త్వరలోనే రూపొందించి అందుబాటులోకి తెస్తానని స్వర్ణకారుడు శ్రీనివాసరావు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
ఇవీ చదవండి: