Vanjangi Tourists Suffer due to Lack of Facilities: అల్లూరి జిల్లా వంజంగి కొండలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నాలుగేళ్లుగా దినదినాభివృద్ధి సాధిస్తూ పర్యాటకంలో వంజంగి కొండలు ఓ మైలురాయిగా నిలిచాయి. సుధీర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యటకులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది. తెల్లమంచు కప్పేసిన వేళ కొండల మాటున భానోదయాన్ని చూసేందుకు పర్యాటకులు అమితాసక్తి చూపుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్నారు. కానీ దీన్ని వీక్షించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ ఒక్క పూర్తిగా విఫలమయ్యాయి. స్థానికుల సాయంతో గేట్లు ఏర్పాటు చేసి ప్రవేశరుసుం మాత్రం వసూలు చేస్తున్నారు. కానీ సౌకర్యాలు విస్మరించారు. ఇంతటి అద్భుత ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వంజంగి కొండపై పర్యాటకుల సందడి - కనీస సౌకర్యాలు లేవని ఆందోళన
పారిశుద్ధ్యం పేరిట ఇటీవల వారం రోజుల పాటు సందర్శనను నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు కానీ అంత అవసరం ఏమి వచ్చిందని స్థానిక నిర్వాహకులు పేర్కొంటున్నారు. వారంలో రెండు రోజులు మాత్రమే అత్యధిక రద్దీగా ఉంటుందని మిగిలిన రోజులు పారిశుద్ధ్య పనులు పెట్టుకోవచ్చు కదా అని చెబుతున్నారు. అక్కడకు వచ్చే పర్యటకులకు ఓ బాత్ రూమ్ సదుపాయం గానీ తాగునీటి సదుపాయం గానీ ఒక వ్యూ పాయింట్ గానీ నిర్మించలేకపోయారు. వంజంగి సూర్యోదయం తిలకించాలంటే తెల్లవారుజాము నాలుగు గంటలకు వెళ్లాలి ఎక్కడ ఒక్క లైట్ కూడా ఉండదు, ఎత్తయిన బండ రాళ్ల మధ్యలో నాలుగు కిలోమీటర్ల నడక ప్రయాణంతో పర్యటకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
విహార యాత్రలో విషాదం - వంజంగి కొండల్లో గుండెపోటుతో పర్యాటకుడు మృతి
ఎత్తైన కొండ ఎక్కిన తర్వాత సూర్యోదయాన్ని చూసి తిరిగి ప్రయాణం అవుతున్నారు. పర్యాటక శాఖ మంత్రి రోజా చింతపల్లి, లంబసింగి హరిత రిసార్ట్స్ ప్రారంభోత్సవం నాడు వచ్చారు. అది చేస్తాం ఇది చేస్తాం అని ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ పనులకు సంబంధించి ఏ ఒక్క అడుగు ముందుకు పడలేదు. పర్యాటకుల నుంచి డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేశారు.
వంజంగి కొండలపై శ్వేతవర్ణ సోయగాలు - తిలకించేందుకు తరలివస్తున్న పర్యటకులు
ఇటీవల టెంట్లు అద్దెకిచ్చే నిర్వాహకులను స్థానిక ఎండీఓ టెంట్లకు నెలవారి అద్దె చెల్లించాలని చెప్పడంతో వారు కంగు తిన్నారు. ఏదో కష్టపడి వారంలో రెండు రోజులు ఉపాధి పొందుతున్నామని పారిశుద్ధ్యం పేర్లతో మమ్మల్ని అద్దె చెల్లించమనడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా మార్గం దారుణంగా ఉండటం, కనీస సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పర్యటకులు కోరుతున్నారు.