ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌పై గిరిజనులు దాడిచేశారు. సంప్రదాయ ఆయుధాలతో స్టేషన్లోకి వచ్చారు. ఏవోబీ కటాఫ్ ఏరియాలో గురుప్రియ వంతెన నిర్మాణం తర్వాత అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించడంలేదంటూ.. ఏడు పంచాయతీలకు చెందిన గిరిజనులు చిత్రకొండ బ్లాక్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో తొలుత ర్యాలీ చేపట్టారు.
అక్కడి నుంచి నేరుగా చిత్రకొండ పోలీసుస్టేషన్‌పై సాంప్రదాయ ఆయుధాలతో దాడికి దిగారు. కత్తులు, గొడ్డళ్లు, బాణాలతో స్టేషన్ గేట్లు బద్దలుకొట్టి స్టేషన్ పరిసరాల్లోకి ప్రవేశించారు. అనంతరం.. వాహనాలు, ఫర్నిచర్, సామగ్రి, భవనాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కలుగజేసుకుని గిరిజనులను శాంతింపజేసి స్టేషన్ నుంచి పంపించేశారు.
అయితే.. స్టేషన్‌పై దాడి వెనుక వేరే కోణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజులుగా చిత్రకొండ పోలీసుల ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో గంజాయి నిల్వలపై దాడిచేశారు. గంజాయి దొరక్కపోవడంతో కొందరు యువకుల‌్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, గిరిజనుల మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొందరికి గాయాలు కావడంతోపాటు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై గిరిజనులు.. ఒడిశా జిల్లా మల్కన్‌గిరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన గిరిజనులు స్టేషన్‌పై దాడికి దిగినట్లు తెలిసింది.
ఇవీ చదవండి: