TROUBLES IN MERGED MANDALS DUE TO GODAVARI FLOODS : గోదారమ్మ ప్రవాహ ఉద్ధృతి నుంచి విలీన మండలాలు ఇంకా తేరుకోలేదు. ఏలూరు, అల్లూరి జిల్లా పరిధిలోని అనేక గ్రామాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది. బాధిత గ్రామాల ప్రజలు చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. కర్రలతో తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా గోదాట్లో ముంచకుండా తమకు పరిహారం ఇచ్చి, పునరావాసం కల్పిస్తే ఈ బాధల నుంచి బయటపడతామని వేడుకుంటున్నారు.
ఎత్తైన ప్రదేశాలు బాధితులకు ఆవాసాలు : పోలవరం విలీన మండలాలు గోదావరి వరదలో మగ్గుతున్నాయి. అల్లూరి జిల్లాలో గోదావరి, శబరికి ప్రవాహం పోటెత్తడంతో 110 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. పండ్రాజుపల్లి వద్ద గోదావరి మరింత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెట్లు, పుట్టలు సగానికిపైగా మునిగిపోయాయి. కనుచూపు మేర నీరే కనబడుతోంది. సమీపంలోని గుట్టలు, కొండలు, ఎత్తైన ప్రదేశాలపై తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వరద బాధితులు దీనంగా కాలం గడుపుతున్నారు.
ప్రతీ సంవత్సరం ఇదే పరిస్థితి : గోదావరి పొంగినప్పుడు కొన్ని సామాన్లతో కొందరు గుట్టలపైకి చేరుకోగా మరికొందరు కట్టుబట్టలతో వచ్చారు. ఏ చిన్న అవసరం వచ్చినా వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ వి.ఆర్.పురం వెళ్లక తప్పడం లేదని అంటున్నారు. పడవల్లో బాధిత ప్రాంతాలకు వస్తున్న ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఆహారం, నీరు, కొన్ని సరుకులు అందిస్తున్నారు. అయితే అందరికీ సాయం అందడం లేదు. వరద పోటుతో ఏటా దురవస్థ పడక తప్పడం లేదని ఈ కష్టాలు తప్పేది ఎప్పుడని ముంపు బాధితులు ప్రశ్నిస్తున్నారు.
సామాన్యులకు కనిపిస్తున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదు : కూనవరం, టేకులబోరు ప్రాంతాల ప్రజలు కోతులగుట్ట గిరిజన హాస్టల్‌లో తలదాచుకుంటున్నారు. చుట్టూ నీరు చేరడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి. సుమారు వారం నుంచి పునరావాస కేంద్రంలో అవస్థలు పడుతున్నా పలకరించే నాథుడు లేడని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందలేదని, తామే కర్రలు కొట్టుకొచ్చి చిన్నచిన్న గుడారాలు కట్టుకున్నామని అంటున్నారు. పరిహారం, పునరావాస ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తే ఈ దుర్గతి తప్పుతుందన్నారు. ముంపు బాధితుల కష్టాలు చూసిన భీమవరానికి చెందిన ఓ కుటుంబం ఓపూట అన్నదానం చేస్తోంది.
"ప్రతీ సంవత్సరం మాకు ఈ వరద కష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు గోదారి వచ్చినప్పటి నుంచి భయంతో ఇక్కడ పాకలు వేసుకోని బతుకుతున్నాం. కట్టుబట్టలతో వచ్చాం. తాగటానికి నీరు కూడా లేదు. గత వారం రోజులు నుంచి నిత్యవసర సరుకులు ఇస్తామన్నారు ఇప్పటికీ ఇవ్వలేదు. మా అవస్థలు తీరేదేప్పుడో?"- బాధితులు