Focus on Tourism: కొత్త జిల్లాలో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఎక్కడా లేవు. ఒక్క పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగితే స్థానిక యువతకు వివిధ రూపాల్లో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బొర్రా గుహలు కొత్త జిల్లాకు ఓ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. గోస్తని నది పక్కన ఏర్పడిన చిన్ని చిన్న వాగులతో ఈ గుహలు ఏర్పడ్డాయని చెబుతారు. 1990లో రాష్ట్ర పర్యాటక శాఖ గుహలను స్వాధీనం చేసుకుని అభివృద్ధి పర్చింది.. ప్రస్తుతం ఏటా 3 నుంచి 4 లక్షల మంది సందర్శకులు గుహలను చూసేందుకు వస్తుంటారని అంచనా వేస్తున్నారు. ఇదే తరహాలో గిరిజన మ్యూజియం, కటికి, తాటిగుడ జలపాతాలు, చాపరాయి, పద్మాపురం గార్డెన్, విశాఖ నుంచి అరకు రైలు యాత్ర, మేఘాలకొండ, డల్లాపల్లి, కొత్తపల్లి జలపాతాలు, లంబసింగి, తాజంగి, చెరువులవెనంలను సందర్శించేందుకు ఏటా లక్షలాది మంది వస్తుంటారు. ఈ ప్రాంతాల్లో వసతి, ఇతర మౌలిక సదుపాయాలు విస్తరించగలిగితే ఏటా ఆదాయం పెరుగుతుంది. సినిమా చిత్రీకరణకు సులభంగా అనుమతి ఇవ్వగలిగితే ఏటా పదుల సంఖ్యలో సినిమాల చిత్రీకరణ జరిగి, తద్వారా జిల్లాకు మంచి ఆదాయం సమకూరుతుంది.
* డుంబ్రిగుడ మండలంలోని అడపవలస సమీపంలోని మల్లమ్మతల్లి గుహలను రెండో బొర్రా గుహలుగా పేర్కొనవచ్చు. మల్లమ్మతల్లి గుహలను అభివృద్ధి చేస్తే పర్యాటకపరంగా అరకులోయకి కొత్త పర్యాటక ప్రాంతం సిగలో చేరుతుంది. చాపరాయి జలపాతం వద్ద రోప్‌వే ఏర్పాటుతో పాటు బోటుషికారుని అభివృద్ధి చేయాలి...
* అనంతగిరి మండలంలోని సరియా జలపాతాన్ని అభివృద్ధి చేస్తే కొత్తగా పర్యాటకులు సందర్శించే అవకాశాలున్నాయి. సరియా జలపాతానికి వెళ్లేందుకు రహదారితో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించాలి.
* అనంతగిరి మండలంలోని పెదబయలు జలపాతాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవేమో....జగదల్‌పూర్ ప్రాంతంలోని జలపాతాల సరసన పెదబయలు జలపాతాన్ని చేర్చుకోవచ్చు.
* కేంద్ర పర్యాటకశాఖ ప్రోత్సాహంతో మేఘాలకొండ, సుజనకోట వంటి ప్రదేశాలలో రోప్‌వే నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు..
* పాడేరులో మోదకొండమ్మ పాదాలు, డల్లాపల్లి, మేఘాలకొండ, కొత్తపల్లి జలపాతం ప్రాంతాల్లో ఆర్‌ఆర్‌ఆర్ వంటి పెద్ద సినిమాలు చిత్రీకరణ జరిగాయి.
* రంపచోడవరం, మారేడుమిల్లి, రాప జలపాతం, గుడిసె ప్రదేశాలలో ఇటీవల పుష్ప చిత్రీకరణ జరిగింది.
* చాపరాయిని రూ.45.46 లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు ఐటీడీఏ పాలకవర్గంలో చర్చించారు. మేఘాలకొండ అభివృద్ధికి రూ.45 లక్షలు కేటాయించి రవాణా సదుపాయాలు కల్పించాలని యోచిస్తున్నారు. తాజంగిలో 10-15 ఎకరాల్లో ఎకో టూరిజానికి ప్రతిపాదించారు.
ప్రతిపాదించి వదిలేసిన పర్యాటక ప్రాజెక్టులు
* గతంలో ప్రతిపాదించి వివిధ కారణాలతో నిలిపి వేసిన ప్రాజెక్టులను తిరిగి వెలుగులోకి తీసుకు రావాలి.
* 2019కి ముందు అరకులోయ మండలం కొత్తవలస రైతు శిక్షణ కేంద్రంలో రూ.10 కోట్ల నిధులతో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం పరిపాలనా నిధులు సైతం మంజూరు చేసింది. కొంతవరకు పనులు ప్రారంభించారు. రైతు శిక్షణ కేంద్రంలో టూరిజంను అభివృద్ధి చేస్తే వ్యవసాయ ప్రయోగాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయనే కారణంతో ఆదిలోనే ఈ ప్రాజెక్టును ఆపేశారు.
* పాడేరు మండలం డల్లాపల్లి పర్యాటక ప్రాంతంలో సందర్శకులు విడిది చేసేందుకు రూ.5 కోట్లతో రెస్టారెంట్, క్యాటేజీలు నిర్మించేందుకు స్థల సమీకరణ సైతం చేశారు. అయినా ప్రాజెక్టు వెనక్కి మళ్లింది.
* కొయ్యూరు మండలం మంపను అప్పటి పాడేరు సబ్ కలెక్టర్ శివశంకర్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ఇది కార్యరూపం దాల్చలేదు. కించువానిపాలెంలో బోటు షికారు, వల్సంపేట జలపాతం వద్ద రోప్-వే ప్రతిపాదించినా పూర్తి కాలేదు.
వయ్యారంగా ఉరికే పొల్లూరు జలపాతం విలీన మండలాల్లోని చింతూరు మండలం మోతుగూడెం వద్ద గల పొల్లూరు జలపాతం వయ్యారంగా ఉరుకుతూ పర్యాటకులకు అందాలను పంచుతోంది. ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి ఉరికే జలపాతం వద్ద గడపడానికి పర్యాటకులు ఇష్టపడతారు. ఈ చుట్టుపక్కల గల జలవిద్యుత్తు కేంద్రాల ప్రదేశాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతంలో ఇటీవల సినిమా చిత్రీకరణలు ఊపందుకున్నాయి. పవర్‌కెనాల్ అందాలు చూడదగ్గవి.
మండువేసవిలోనూ శీతల వాతావరణంతో ఉండే మారేడుమిల్లి ప్రాంతం ప్రస్తుతం ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. 2005 నుంచి ‘కమ్యూనిటీ బేస్డ్ ఎకో-టూరిజం’ (సీˆబీఈటీ)లో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ‘వనవిహారి ఎకో-టూరిజం’, ‘జంగిల్‌స్టార్ నేచర్‌క్యాంపు ఎకో-టూరిజం’ల పేరుతో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వీటి ద్వారా పర్యాటకులకు అవసరమైన కాటేజీలు, రెస్టారెంట్లను నిర్వహిస్తున్నారు. అలాగే మారేడుమిల్లి ప్రాంతంలోని ‘జలతరంగిణి’, ‘అమృతధార’, దుంపవలస, దుంపధారవాడ మొదలైన జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మారేడుమిల్లిలో పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీˆటూరిజం) ఆధ్వర్యంలో ఐదు నక్షత్రాల వసతులతో నిర్మించిన ‘ది ఉడ్స్’ కాటేజీలు ప్రత్యేక ఆకర్షణ. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్, అల్లుఅర్జున్, సునీల్ తదితర హీరోలు దీనిలో బస చేశారు.
గుడిస... పర్యాటకుల వలస...! : మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ పరిధిలోని ‘గుడిస’ కొండ పర్యాటకంగా అభివృద్ధి చెందింది. మారేడుమిల్లికి సుమారు 45 కి.మీ. దూరంలో ఉండే ఈ ప్రదేశం ఎత్తైన కొండ. దీనిపైకి వెళ్లడానికి వంపులు తిరిగే రహదారి ప్రధాన ఆకర్షణ. చేతికందే ఎత్తులో ఉన్నట్లుగా ఉండే ఆకాశం, తెల్లవారుజామున సూర్యోదయం ప్రత్యేకత.
గోదావరి నది.. పులకించెను మది! : దేవీపట్నం మండలంలోని గోదావరి నది పరివాహక ప్రదేశాలు, గోదావరిపై బోటు షికారు పర్యాటకుల మది పులకింపు చేస్తుంది. పోశమ్మగండి నుంచి బయలుదేరే పర్యాటక బోట్లు పాపికొండల మీదుగా పేరాంటాలపల్లి వరకు వెళ్లి తిరిగి వస్తుంటాయి. గోదావరి నదిపై ప్రయాణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండడంతో అది పూర్తయితే ఈ పాపికొండల యాత్రలకు అవకాశం ఉండదు.
భూపతిపాలెం జలాశయం.. బోటు షికారు : రంపచోడవరం వద్ద గల భూపతిపాలెం రిజర్వాయర్ (జలాశయం) పర్యాటకులను ఆకట్టుకుంటోంది. బోటు షికారుకు మొగ్గుచూపుతున్నారు. రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం వద్ద గల వాగు పరివాహక ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నారు.
పింజరికొండ.. అందాలే నిండా! : అడ్డతీగల మండలంలోని పింజరికొండ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతంలో నిర్మించిన మినీ జలవిద్యుత్తు కేంద్రం ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: 24 మంది మంత్రుల రాజీనామా.. ఈనెల 11న కొత్త కేబినెట్