Virat Kohli BCCI News: తప్పు ఎవరిదైనా.. ముగింపు పలకాలిక..! - odi captaincy news
Virat Kohli BCCI News: వన్డే సారథిగా కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను నియమించడం భారత క్రికెట్‌ను కుదిపేస్తున్నట్లే కనిపిస్తోంది. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించబోతున్న విషయాన్ని ముందే అతడికి చెప్పామని బోర్డు వర్గాలంటుండగా.. అతనేమో నిర్ణయాన్ని ప్రకటించడానికి గంటన్నర ముందే తనకు చెప్పారంటున్నాడు. అయితే తప్పు ఎవరిదైనా ఇలాంటి వివాదాలు భారత క్రికెట్‌కు చేటు చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Virat Kohli BCCI News: అప్పుడెప్పుడో గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న రోజుల్లో భారత క్రికెట్లో ఆటేతర విషయాలు చర్చనీయాంశంగా అయ్యాయి. ఆ తర్వాత మైదానం వెలుపలి విషయాలు ఎప్పుడూ పెద్దగా చర్చకు వచ్చింది లేదు. పేరున్న ఆటగాళ్లపై వేటు పడ్డా.. కెప్టెన్లు మారినా.. అంతా సాఫీగానే సాగిపోయింది. పెద్ద వివాదాలైతే ఎన్నడూ లేవు. కానీ ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను నియమించడం భారత క్రికెట్‌ను కుదిపేస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ నిర్ణయం ప్రకటించాక కొన్ని రోజులు మౌనం వహించిన కోహ్లీ.. ఇటీవలే విలేకరుల సమావేశంలో బోర్డును, సెలక్టర్లను తప్పుబట్టడం చర్చనీయాంశంగా మారింది. తప్పెవరిదన్నది పక్కన పెడితే అత్యవసరంగా ఈ వివాదానికి ముగింపు పలకకపోతే భారత క్రికెట్‌కు చేటే!
భారత క్రికెట్లో చివరగా కెప్టెన్సీ మార్పు విషయంలో వివాదం నెలకొన్నది 2006 ప్రాంతంలో. అప్పటి కెప్టెన్ గంగూలీపై వేటు వేసి ద్రవిడ్‌కు పగ్గాలు అప్పగించినపుడు పెద్ద దుమారమే రేగింది. ఈ నిర్ణయంలో గ్రెగ్ చాపెల్ పాత్ర కీలకమన్న సంగతి తెలిసిందే. చాపెల్‌తో గంగూలీ సహా పలువురు ఆటగాళ్లకు ఇబ్బంది తలెత్తగా.. అతణ్ని సాగనంపడం వల్ల పరిస్థితులు సద్దుమణిగాయి. అక్కడి నుంచి బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. క్రికెటర్ల నుంచి కూడా పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో, కెప్టెన్సీ మార్పు పరంగా వివాదాలేమీ లేవు. ధోనీ మూడు ఫార్మాట్లలో పగ్గాలందుకున్నాక అందుకు ఆస్కారమే లేకపోయింది. అతడి నుంచి కోహ్లీకి కూడా సారథ్య బాధ్యతల బదలాయింపు సాఫీగా సాగిపోయింది. ఆటగాడిగా, కెప్టెన్‌గా విరాట్ ఉత్తమ ప్రదర్శన చేస్తుండటం వల్ల అతను తనకు తానుగా దిగిపోవడమే తప్ప.. వేటు వేయాల్సిన అవసరం వస్తుందని ఒకట్రెండేళ్ల ముందు వరకు ఎవరూ ఊహించలేదు. కానీ ఫామ్ దెబ్బ తినడం, అదే సమయంలో ఐసీసీ టోర్నీల్లో జట్టు వైఫల్యం విరాట్ కెప్టెన్సీకి ఎసరు తెచ్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్ వరకు రోహిత్‌ను నాయకుడిని చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. కోహ్లీ మద్దతుదారులకు ఈ డిమాండ్ రుచించకపోయినా.. సగటు క్రికెట్ అభిమానికి ఇది సహేతుకంగానే అనిపించింది. బోర్డు పెద్దలు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు కానీ.. కోహ్లీకి ఈ విషయంలో సరైన సమాచారం ఇవ్వడంలో, అతడికి సర్దిచెప్పి సాఫీగా నాయకత్వ మార్పు జరిగేలా చేయడంలో విఫలమయ్యారన్నది తాజా పరిణామాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.
ఎవరి వాదన నిజం?: ఐసీసీ టోర్నీల్లో వైఫల్యాన్ని పక్కన పెడితే వన్డే, టీ20 కెప్టెన్‌గా కోహ్లీకి చాలా మంచి రికార్డుంది. ఇక ఆటగాడిగా కోహ్లీ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య అతడి ఫామ్ కొంత దెబ్బ తింది. కెప్టెన్‌గా ముందుండి నడిపించట్లేకపోతున్న మాట వాస్తవం. అయితే తనకు తానుగా టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడం వల్ల.. టీ20లకు వేరుగా, వన్డేలకు వేరుగా కెప్టెన్లను పెట్టడం సరికాదన్న ఉద్దేశానికి బోర్డు వచ్చి ఉండొచ్చు. రెండు ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్ ఉండాలన్న బోర్డు నిర్ణయం సరైందే అనడంలో సందేహం లేదు. అయితే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నపుడు.. కాస్త ముందే అతడికి సమాచారం ఇవ్వాల్సింది. జట్టు ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అతడికి సర్ది చెప్పాల్సింది. కోహ్లీ స్థాయి ఆటగాడిపై వేటు వేశారన్న భావన అభిమానుల్లో కలగకుండా చూడాల్సింది. టీ20లకు మాత్రమే కెప్టెన్‌గా తప్పుకుంటానని కోహ్లీ చెప్పినపుడు.. రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లుండటం సరికాదన్న విషయాన్ని అతడికి తెలియజేయాల్సింది. అప్పుడే వన్డే సారథ్యాన్ని కూడా విడిచిపెట్టాలని కోహ్లీకి సూచించాల్సింది. కానీ కోహ్లీ చెబుతున్న దాని ప్రకారం.. టీ20 కెప్టెన్సీ వదిలేస్తానన్నపుడు బోర్డు, సెలక్షన్ కమిటీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదట. అతడి నిర్ణయాన్ని సమర్థించారట. ఇదే నిజమైతే బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు తప్పు చేసినట్లే. ఇక వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించబోతున్న విషయాన్ని ముందే అతడికి చెప్పామని బోర్డు వర్గాలంటుండగా.. అతనేమో నిర్ణయాన్ని ప్రకటించడానికి గంటన్నర ముందే తనకు చెప్పారంటున్నాడు. ఈ విషయంలో కోహ్లీకి ముందే సమాచారం వచ్చి ఉంటే.. అతను తనకు తానుగా గౌరవప్రదంగా తప్పుకోవాల్సింది. అలా కాని పక్షంలో హఠాత్తుగా నిర్ణయాన్ని ప్రకటించిన సెలక్టర్లదే తప్పవుతుంది.
ఇక టీ20 కెప్టెన్సీని వదిలిపెట్టి వన్డేల వరకు కెప్టెన్‌గా కొనసాగాలని కోహ్లీ భావించడంలో లాజిక్ లేదు. టెస్టులకు ఒక కెప్టెన్.. వన్డేలు, టీ20లకు ఇంకో కెప్టెన్ అంటే చెల్లుతుంది కానీ.. వన్డేలు, టీ20లు రెండూ పరిమిత ఓవర్ల క్రికెట్టే కాబట్టి వాటికి వేర్వేరు సారథులుండటంలో అర్థం లేదు. జట్టు సభ్యులతో సహా అందరికీ అది ఇబ్బందిగా ఉంటుంది. మొత్తానికి తప్పు ఎవరిదైనప్పటికీ.. ప్రస్తుత వివాదం భారత క్రికెట్‌కు మేలు చేసేదైతే కాదు. ఈ వివాదం మరింత ముదిరితే జట్టు వర్గాలుగా విడిపోవడం, ఆటగాళ్ల ఏకాగ్రత చెదరడం ఖాయం. కాబట్టి జరిగిందేదో జరిగిందని.. వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలికి అందరూ ఆట మీద దృష్టిసారించడం అవసరం.
ఇవీ చూడండి: