టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. గాయాల కారణంగా కొద్ది రోజుల పాటు ఆటకు దూరమైన స్టార్ పేసర్ బుమ్రా కోలుకుని ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తో జట్టులోకి తిరిగివచ్చాడు. అయితే అతడు మళ్లీ వెన్నునొప్పి కారణంగా అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న వరల్డ్ కప్ నుంచి వైదొలిగినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. "టీ20 ప్రపంచకప్ కోసం బుమ్రా ఆసీస్ వెళ్లకపోవచ్చు. అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. కనీసం ఆరు నెలలపాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది" అని బీసీసీఐ అధికారులు వెల్లడించారు.
చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన బుమ్రా ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆడాడు. అయితే తాజాగా తిరువనంతపురం వేదికగా జరిగిన దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే గాయం కారణంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వరల్డ్ కప్‌నకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా బుమ్రా కూడా లేకపోతే టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. పేస్‌కు సహకరించే ఆసీస్ పిచ్‌లపై బుమ్రా చెలరేగుతాడని ఆశించిన అభిమానులకు భంగపాటు తప్పేలా లేదు. అయితే బుమ్రా వ్యవహారంపై బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ బుమ్రా దూరమైతే.. అతడి స్థానంలో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ప్రధాన జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం షమీ టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన స్టాండ్‌బై ప్లేయర్ల జాబితాలో ఉన్నాడు. అప్పుడు షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్/అవేశ్ ఖాన్‌ను తీసుకొనే ఛాన్స్ ఉంది.
జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (కీపర్), దినేశ్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్య, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్