సచిన్ తెందూల్కర్.. ప్రపంచ దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా అతడి పేరు మీద అనేక రికార్డులు లిఖించుకున్నాడు. అందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించడం. అయితే ఆ మ్యాచ్‌లో సచిన్.. 190ల్లో ఉన్నపుడు ఔట్ అయ్యేవాడని అంటున్నాడు దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్.
"గ్వాలియర్ వన్డేలో మా జట్టుపై సచిన్ డబుల్ సెంచరీ చేసిన క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. అతను 190ల్లో ఉన్నపుడు పరుగుల వద్ద నేను వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. కానీ, అంపైర్ ఇయాన్ గౌల్డ్ మాత్రం దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. ఎందుకు నాటౌట్ అని అంపైర్‌ను ప్రశ్నించాను. చుట్టూ చూస్తూ.. 'ఇప్పుడు నేను ఔటిస్తే హోటల్‌కు వెళ్లే పరిస్థితి ఉండదు' అనే విధంగా కనిపించాడు". - డేల్ స్టెయిన్, దక్షిణాఫ్రికా పేసర్
స్టెయిన్ చెప్పినవన్నీ అబద్ధాలే ఎందుకంటే..
ఆ మ్యాచ్‌లో సచిన్ 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే, మ్యాచ్ మొత్తంలో లిటిల్‌మాస్టర్.. స్టెయిన్ బౌలింగ్‌లో ఆడింది కేవలం 31 బంతులే. ఇక సచిన్ 190 వద్ద బ్యాటింగ్ చేసేటప్పుడు స్టెయిన్ బౌలింగ్‌లో మూడు బంతులే ఎదుర్కొన్నాడు. వాటిని కూడా క్రికెట్ దిగ్గజం షాట్లు ఆడాడు. ఎక్కడా స్టెయిన్ ఎల్బీడబ్ల్యూ చేసిన ఆనవాళ్లే లేవు. ఈ విషయాలన్నీ ఆ మ్యాచ్ గణంకాలను పరిశీలిస్తే బయటపడ్డాయి. దీంతో స్టెయిన్.. సచిన్ తెందూల్కర్ ఘనతపై అబద్ధాలు చెప్పాడని తెలుస్తోంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 401/3 పరుగులతో భారీ స్కోర్ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 248 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 153 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. సచిన్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఏనాడూ వివాదాల జోలికి పోలేదు. మైదానంలో తన బ్యాటింగ్, స్నేహపూర్వక వ్యవహారశైలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు, వంద శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇదీ చూడండి.. భారత క్రికెటర్లకు కెప్టెన్‌గా ఇమ్రాన్‌ఖాన్!