ETV Bharat / sitara

పిల్లల కోసమే అక్కడికి వెళ్తా..!

పాడలేను పల్లవైనా భాషరాని దానను...’ - చిత్ర పాడిన తొలి తెలుగు పాట ఇది! చిత్రమేమిటంటే పల్లవైనా పాడలేనంటూ ఇటొచ్చిన ఆమె తన మాతృభాష మలయాళం కన్నా ఇక్కడే ఎక్కువ పాటలు పాడారు. పాడేటప్పుడు ఎంతో సీరియస్‌గా ఉండే చిత్ర... మాట్లాడేటప్పుడు పసిపాపంత అమాయకంగా నవ్వుతుంటారు. ఆ పాటలూ, ఆ స్వచ్ఛమైన నవ్వులేనా చిత్ర అంటే- కాదు, అంతకుమించిన వైరుధ్యాలూ విషాదాలూ ఉన్నాయి ఆమె జీవితంలో. అవి నేర్పిన పాఠాలే తననీ స్థాయిలో నిలిపాయనే చిత్ర ఆ విషాదానందాలకి కారణమేంటో చెప్పే క్రమంలో ఇప్పటిదాకా సాగిన తన పాటల ప్రస్థానాన్నీ నెమరేసుకున్నారు ఇలా...

.
.
author img

By

Published : Feb 8, 2021, 12:34 PM IST

అప్పుడు నాకు ఐదేళ్లుంటాయి. మా తమ్ముడు మహేశ్‌ ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. మా అమ్మ ఆ ఉయ్యాల ఊపుతూ మెల్లగా ‘ప్రియతమా... ప్రియతమా!’ అంటూ మలయాళంలో పాట పాడుతోంది. అప్పుడే ఇంటికెవరో పెద్దవాళ్లొస్తేనూ అమ్మ వాళ్లని హాల్లో కూర్చోబెట్టి మాట్లాడుతోంది... నాన్న కూడా వచ్చిన పెద్దామెతో మాటలు కలిపాడు. ఇంతలో ఉయ్యాల్లోని తమ్ముడు చిన్నగా ఏడిస్తే... నేనుఆ ఊయ్యాల ఊపుతూ అమ్మ పాడినట్టే ‘ప్రియతమా... ప్రియతమా...’ అని పాడటం మొదలుపెట్టాను. పాటలో పూర్తిగా లీనమైపోయానేమో... బయట మాటలు ఆగిపోయిన విషయం గమనించలేదు. మా ఇంటికొచ్చిన పెద్దావిడ నా పాట వింటూ వెనకే నిల్చుందన్న సంగతీ తెలియలేదు. ఆమె నన్ను వెనక నుంచే ఎత్తుకుని ముద్దు పెట్టుకుని నాన్నతో ‘కృష్ణా... పాపకి మంచి ప్రతిభ ఉందిరా! నేనే సంగీతం నేర్పాలి దీనికి!’ అన్నారు. ఆమె పేరు ఓమనకుట్టి అనీ, కేరళలో గొప్ప కళాకారుల్ని తీర్చిదిద్దిన సంగీతాచార్యురాలనీ అంత చిన్న వయసులో నాకేం తెలుస్తుంది!

ఆమె మా ప్రాంతంలో ఏదో కచేరీ ఉండి నాన్నతో ఉన్న పాత పరిచయంతో మా ఇంట్లో బసచేశారు ఆరోజు. కాకపోతే ఆమె చెప్పినట్టు నేను సంగీతం నేర్చుకోవడానికి మరో పదేళ్లు పట్టింది. నేను చిన్నప్పుడు సంగీత శిక్షణ తీసుకోలేదు. నిజానికి, నన్ను ఈ రంగంలోకి తీసుకెళ్లాలన్న ఆలోచనే మా కుటుంబానికి లేదు. మేమంతా మా అక్కయ్య బీనానే అటువైపు వెళుతుందని అనుకునేవాళ్లం. కానీ, మేమొకటి తలిస్తే... దైవం ఇంకొకటి తలచింది.

నా పేరులో అమ్మ

నా పూర్తి పేరు కె.ఎస్‌.చిత్ర అని మీకు తెలిసే ఉంటుంది. అందులో ‘కె’ మా నాన్న పేరు కృష్ణన్‌ నాయర్‌. ‘ఎస్‌’ శాంతకుమారి మా అమ్మపేరు. ‘పిల్లలకి ఇనిషియల్‌గా తండ్రిపేరే ఎందుకుండాలి... తల్లి పేరూ ఉంటే తప్పేమిటీ!’ అని నా పేరులో అమ్మ పేరునీ చేర్చిన అభ్యుదయవాది నాన్న. ఆయనతోపాటూ అమ్మ కూడా టీచరే. సంతానంలో ఎవరైనా సంగీత రంగంలోకి వెళ్లాలనే కల ఉండేది ఆ ఇద్దరికీ. మా అక్కయ్యని ఆ కలకి ప్రతిరూపంగానే చూశారు. చిన్నప్పుడే పద్ధతిగా సంగీతం నేర్పించారు. అక్కయ్య అలా నేర్చుకుంటూ ఉంటే నేనూ వెంట వెళతానని మారాం చేసేదాన్ని. చెప్పొద్దూ చిన్నప్పుడు నేను కాస్త అల్లరిపిల్లనే. అబ్బాయిలకి పోటీగా చెట్లెక్కి దూకేదాన్ని. పొట్టిగా ఉంటానని ఫస్ట్‌ బెంచ్‌లో కూర్చోబెట్టేవాళ్లు కానీ... నిజానికి నేను యావరేజ్‌ విద్యార్థినినే. సంగీతం నేర్చుకుంటున్న మా అక్క సంగీత సాధన చేసేటప్పుడు విని నేనూ స్వరం తప్పకుండా వినిపించగలిగేదాన్ని. ఓసారి ఆలిండియా రేడియోలోని ఓ నాటకంలో రెండేళ్ల కృష్ణుడికి నా చేత పాటపాడించారు. నేను చూసిన తొలి రికార్డింగ్‌ అదే. అది ప్రసారమయ్యాక బాగా ఫేమసైపోయాను. చుట్టుపక్కల ఎక్కడ కచేరీలు జరిగినా నన్ను పిలవడం మొదలుపెట్టారు. సహజంగానే, పేరు ప్రఖ్యాతులు తలకెక్కి గర్వపడే ప్రాయం కదా... అది! కానీఆ గర్వం వల్ల వచ్చే నష్టమేంటోఅమ్మానాన్నలు స్పష్టంగా చెప్పారు.

‘నీ గాత్రం దేవుడిచ్చిందమ్మా... అందులో నీ ప్రమేయం ఏమీ లేదు. నువ్వు చేయాల్సిందంతా సాధనతో దాన్ని నిలబెట్టుకోవడమే. గర్వపడ్డ ప్రతిసారీ- నీకు చేరువైన విజయం వంద అడుగులు దూరం వెళుతుంది!’ అన్నారు. జీవితంలో నేను ఇప్పటికీ పాటిస్తున్న పాఠం అది.

అక్కత్యాగం

అక్కా, నేనూ సంగీతం వైపు వెళుతున్నా... మొదట సినిమాలో పాడే అవకాశం తనకే వచ్చింది. ఇంట్లో మాఇద్దరిలో ఒక్కరే సంగీతరంగంలోకి వెళ్లే పరిస్థితి! దాంతో ఆ అవకాశం నాకు ఇచ్చి అక్క తప్పుకుంది. ఓ రకంగా తను నాకోసం చేసిన త్యాగం అది. తనలా చేయకపోయుంటే నేను ఈ రంగంలోకి వచ్చి ఉండేదాన్నీ కాదు... నాకిన్ని అవార్డులూ వచ్చుండేవీ కావు. నేను పూర్తిస్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం కేంద్రప్రభుత్వం అందించే ‘నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ స్కాలర్‌షిప్‌’కి దరఖాస్తు చేయమన్నారు నాన్న. దానికి ఎంపిక కావాలంటే అప్పటికే రెండేళ్లపాటు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. నేను సంగీతం నేర్చుకున్నదాన్ని కాకపోయినా ఏదో పాడతాను కాబట్టి దరఖాస్తు చేశాను. సెలెక్షన్‌ కోసం ఏడుగురు న్యాయనిర్ణేతల ముందు ఓ పాట పాడి వినిపించాలి. అందుకోసం తోడిరాగంలోని ఓ త్యాగరాజ కృతిని ఎంచుకుని క్యాసెట్లో విన్నది విన్నట్టు పాడేశాను. అంతా విన్నాక ఓ న్యాయనిర్ణేత ‘తోడిరాగం ఆరోహణ అవరోహణలు చెప్పమ్మా!’ అన్నారు. ‘నాకు తెలియదండీ’ అన్నాను నిజాయతీగా! న్యాయనిర్ణేతలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ‘నువ్వు పాడిన పాటలో నీకే తెలియకుండా అసావేరికి చెందిన ఓ అద్భుతమైన ప్రయోగం చేశావు. నువ్వు ప్రతిభాశాలివే...’ అని చెప్పి స్కాలర్‌షిప్పు ఇచ్చేశారు. ఏడేళ్ల ఆ స్కాలర్‌షిప్పుతో సంగీతం నేర్చుకోవడానికి డాక్టర్‌ ఓమనకుట్టిగారినే ఎంచుకున్నాను. అప్పట్లో నా లక్ష్యం ఒక్కటే... సంగీతం లోతులు తరచి చూసి మా గురువుగారిలా సంగీతాచార్యురాలిని కావాలన్నదే. కానీ... అనుకోకుండా నా ట్రాక్‌ మారింది.

మలుపు తిప్పిన క్షణం

మా గురువు ఓమనకుట్టిగారి అన్నయ్య ఎంజీ రాధాకృష్ణన్‌ 1979లోనే ఓ సినిమాకి నన్ను పాడించారు కానీ... ఆ సినిమా రిలీజు కాలేదు. 1982లో మళ్లీ ఓసారి అవకాశమిస్తే పాడాను. అదో డ్యూయెట్‌. మొదట్లో ‘ట్రాక్‌’ కోసమని రికార్డు చేశారు. నాతోపాటు ఓమనకుట్టిగారి తమ్ముడు ఎంజీ శ్రీకుమరన్‌ పాడారు. ఆ తర్వాత శ్రీకుమరన్‌ ట్రాక్‌కి బదులు దాసన్న (కే జే ఏసుదాసు)ని ఎంచుకున్నారు. ఆయనకోసం మరోసారి నన్ను పాడమన్నారు. ఏసుదాసుగారి పక్కన నిల్చుని పాడటమన్న ఆ ఆలోచనకే గడగడా వణికిపోయాను. రికార్డింగులో తప్పులొచ్చాయి. అయినాసరే... దాసన్న ఓపిగ్గా సవరణలు చెప్పి పాడించారు. ఆ పాట బయటకొచ్చాక ‘ఏసుదాసుతో ఎవరో చిన్న పిల్ల పాడిందట!’ అంటూ ఇండస్ట్రీలోని మిగతా సంగీతదర్శకులూ నాకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ కొద్ది రోజుల్లోనే- ‘మరీ చిన్నపిల్లల గొంతులాగా ఉంది. పెద్దవాళ్లకి పనికిరాదు!’ అనే ముద్రపడింది. కాకపోతే నా అదృష్టం కొద్దీ- నేనలా చిన్నపిల్లలా నటి నదియా కోసం పాడిన ఓ పాట ఇళయరాజాగారి చెవిన పడింది! నా కెరీర్‌ని మలుపుతిప్పిన క్షణాలవి.

ఇళయరాజా జోస్యం

అప్పట్లో తిరువనంతపురంలోని మా ఇంటికి దగ్గర ‘శివన్‌’ అనే థియేటర్‌ ఉండేది. అందులో తమిళ సినిమాలు వేసేవారు. ప్రదర్శనలకి ముందు పెద్ద సౌండ్‌తో పాటలు వినిపిస్తుండేవారు. అరవం అర్థం కాకున్నా ఇళయరాజా పాటలతో పరిచయం అలా ఏర్పడింది! పోనుపోను ఆయన గురించి అందరూ గొప్పగా చెప్పడం వింటుండేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక ఆయనతో పనిచేసే అవకాశం రాకపోతుందా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ‘పెద్దవాళ్లకి నా గొంతు పనికిరాదు!’ అన్న విమర్శతో ఆ కలలన్నీ నీరుగారిపోయాయి. అలాంటి సందర్భంలోనే మలయాళంలో నదియా నటించి నేను పాటలు పాడిన సినిమాని దర్శకుడు ఫాజిల్‌ తమిళంలో తీయాలను కున్నారు. ఇళయరాజాగారే సంగీతం. ఆయన మలయాళం ఒరిజినల్‌లోని నా పాటలు విని ‘ఈ గొంతు కొత్తగా ఉంది... తమిళంలోనూ వాడేద్దాం!’ అన్నార్ట. దాంతో ఫాజిల్‌ ‘చెన్నై వెళితే ఓసారి రాజాగార్ని కలవండి!’ అన్నార్ట నాన్నగారితో. ఆయన చెప్పినట్టే ఓ రోజు నాన్నతోపాటూ బిక్కుబిక్కుమంటూ రాజాగారి స్టూడియోకి వెళ్లాను. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నానని విని ఓ కీర్తన పాడమన్నారు. ‘ఇంత సౌఖ్యమని నే జెప్పజాల...’ అన్న కృతి పాడాను కానీ భయంతో ఉచ్ఛ్వాసనిశ్వాసాలు పెరిగి ‘జెప్పజా...లా’ అంటూ పదాల్ని విరిచేశాను. రాజాగారు ‘అలా పాడకూడదమ్మా...’ అని చక్కగా నేర్పించి పంపారు. అంత తప్పులుతడకలుగా పాడిన నాకేం అవకాశమిస్తారు అనుకున్నాను. కానీ, తర్వాతి వారమే నదియా నటించిన సినిమాలో అన్నిపాటలూ నా చేత పాడించారు. ఆ తర్వాతే ‘సింధుభైరవి’ వచ్చింది. ఆ సినిమా తెలుగు వెర్షన్‌లో ‘నేనొక సింధు...’ అనే సుశీలగారి పాట ఉంటుంది. దాన్ని తమిళంలో నేను పాడాను. ఆ పాట రికార్డింగ్‌ మధ్యాహ్నం పూర్తయిపోతే... సాయంత్రం ట్రెయిన్‌కి వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాం. అప్పటికి బీఏ మ్యూజిక్‌లో డిగ్రీ అందుకుని ఎమ్మేలో చేరాను. ఆ తర్వాతి రోజే నాకు పరీక్షలు. మేం బయల్దేరుతుండగా రాజాగారు ‘ఇంకో మంచి పాట ఉంది. పాడి వెళ్తావా!’ అని అడిగారు. నాన్నేమో ‘పాపకి రేపు పరీక్షలు సార్‌...!’ అన్నారు. ‘డిగ్రీలు పక్కనపెట్టండి... ఇది అంతకన్నా పెద్దస్థాయికి తీసుకెళుతుంది!’ అన్నారు. నాన్నకేమీ పాలుపోక అమ్మకి ఫోన్‌ చేశారు. ‘తర్వాతైనా ఎమ్మే పూర్తి చేస్తానని మాటిస్తేనే పరీక్షలు మాను’ అంది అమ్మ నాతో. అలాగేనని ప్రామిస్‌ చేశాను. కానీ ఆ మాట ఎప్పటికీ నిలుపుకోలేని పరిస్థితొచ్చింది. రాజాగారి జోస్యం నిజమైంది. ‘పాడరియేన్‌...’ అనే ఆ పాట నాకు తొలి జాతీయ అవార్డునే కాదు, తీరికలేనన్ని అవకాశాల్నీ తెచ్చిపెట్టింది. దాని తెలుగు వెర్షన్‌ ‘పాడలేను పల్లవైనా...’తోనే తొలిసారి తెలుగు శ్రోతలకి పరిచయమయ్యాను.

నాకు తోడూనీడా...

నేను బీఏ సంగీతం చదువుకునేటప్పుడు వేరే కాలేజీకి చెందిన రాజీ అనే అమ్మాయి నాతో పోటీపడుతూ ఉండేది. ఎంత స్పర్థ ఉన్నా నాకు తను మంచి స్నేహితురాలు! ఆ అమ్మాయికి ఓ అన్నయ్య ఉన్న విషయం నాకు తెలియదు. అతనికి నన్ను ఇచ్చి వివాహం చేయమని మా నాన్న ఫ్రెండ్‌ ద్వారా అబ్బాయి తల్లిదండ్రులు కబురు చేశారు. అతని పేరు విజయ్‌శంకర్‌... ఎలక్ట్రికల్‌ ఇంజినీరు అని చెప్పారు. ఆ కుటుంబంలో అందరూ సంగీతకారులే కాబట్టి... నాన్న నన్ను ఆ కుటుంబానికే ఇవ్వాలనుకున్నారు. అలా 1988లో మా పెళ్లైంది. ఓ దశ దాకా రికార్డింగుల కోసమని నాన్నే నాతో వచ్చేవారు. నాన్నకి నోటి క్యాన్సర్‌ వచ్చి మంచానపడటంతో కొంతకాలం అమ్మ నా వెంట వచ్చింది. ఆ తర్వాత నా బాధ్యతంతా ఆయనే తీసు కున్నారు. కేరళలో పనిచేస్తున్న ఆయనకి ప్రతిసారీ నాతో రావడం ఇబ్బందయ్యేది. దాంతో చెన్నైకి బదిలీ చేయమని అడిగారు. కంపెనీ ఒప్పుకోకపోవడంతో రిజైన్‌ చేసేసి నాతోపాటూ వచ్చేశారు. అప్పటి నుంచీ ఆయనే అనుక్షణం నాకు తోడూనీడయ్యారు... ఇంకే ఉద్యోగమూ చేయలేదు. ‘భార్య సంపాదిస్తోంది కదా, ఇంక ఉద్యోగమెందుకు...’ అని కొందరు అనుకోవచ్చుకానీ ఉద్యోగం వదిలేసి భార్య వెంట స్టూడియోలకు తిరగడానికి చాలామందికి పురుషాహంకారం అడ్డువస్తుంది కదా! అదిలేని స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఆయనది. మా అమ్మానాన్నలిద్దరూ పదేళ్ల గ్యాప్‌లో చనిపోతే... మా అత్తగారు అరచేతిలో పెట్టి చూసుకున్నారు నన్ను! ఎంత పేరుప్రఖ్యాతులున్న కోడలైనా- ఎప్పుడో ఒకసారి వంటింట్లోకి వెళ్లి ఏదో ఒకటి వండిపెట్టాలని ఎదురుచూడని అత్తలుంటారా... అదీ నిన్నటి తరంలో! కానీ మా అత్తయ్య నన్ను వంటింట్లో అడుగే పెట్టనివ్వలేదు... చనిపోయేదాకా!

నా పాప వెళ్లిపోయింది

పెళ్లైనప్పటి నుంచీ కెరీర్‌లో బాగా బిజీ అయిపోయాన్నేను. పదిహేనేళ్లలో నాలుగు దక్షిణాది భాషలతోపాటూ హిందీలోనూ పాతికవేల పాటలు పాడాను. నాలుగుదక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులూ అందుకున్న ఏకైక గాయనిగా పేరుతెచ్చు కున్నాను. కెరీర్‌లో అంత ఎత్తుకు ఎదిగినా... నా కడుపు పండలేదనే బాధ మమ్మల్ని పీడిస్తూనే ఉండేది. అందుకోసం వేడుకోని దైవం లేడు... చేయని నోము లేదు. అవి ఫలించాయేమో 2002 డిసెంబర్‌ 18న మాకో పాప పుట్టింది. మోడువారినట్టున్న జీవితాలకి పచ్చదనాన్ని పంచిందని నందన అని పేరుపెట్టాం. పుట్టిన కొన్నాళ్లకే పాపకు ‘డౌన్‌ సిండ్రోమ్‌’ లోపం ఉందని తెలిసినా అది మాకెప్పుడూ సమస్యగా అనిపించలేదు. తనని చూసుకోవాలనే పాటల్ని సగానికి సగం తగ్గించుకున్నాను. 2005వ సంవత్సరం హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్‌కి నందనతోపాటూ వచ్చినప్పుడే నాకు పద్మశ్రీ ప్రకటించారు! దక్షిణాదికి చెందిన ఓ సినీగాయనికి పద్మ అవార్డు దక్కడం అదే తొలిసారి. అది మా పాప తెచ్చిన అదృష్టంగానే భావించాను. తను లేనిదే క్షణం గడిచేది కాదు నాకు. 2011 ఏప్రిల్‌... దుబాయ్‌లో ఏఆర్‌ రెహ్మాన్‌ కచేరీ కోసం పాపను తీసుకుని వెళ్లాను. అందరితోపాటూ హోటల్‌లో ఉండకుండా ఓ విల్లాలో ఉన్నాం. పిల్లలకి నీళ్లంటే ఎంతిష్టమో చెప్పాలా... వెళ్లినప్పటి నుంచీ అక్కడున్న స్విమ్మింగ్‌ పూల్‌లో బాగా ఆడుతుండేది. ఆ రోజు వాళ్లనాన్న బయటకు వెళ్లారు. పాప హాలులో ఆడుకుంటూ ఉంది. ‘అమ్మలూ స్నానం చేసి వస్తా!’ అని చెప్పి నేను లోపలికి వెళ్లాను. పది నిమిషాలయ్యాక వచ్చి చూస్తే తను లేదు... పరుగున బయటకొచ్చి చూసినా కనిపించలేదు. చివరికి స్విమ్మింగ్‌పూల్‌లో తేలుతూ కనిపించింది. ప్రాణంతో లేదని మనసు చెబుతున్నా ఏదో ఆశతో ఆసుపత్రికి తీసు కెళ్లాను. అది అడియాసే అయ్యింది. తను లేనిదే అడుగుబయట పెట్టని ఈ అమ్మని విడిచి... తనొక్కతే తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయింది! ఆ తర్వాత ఏం జరిగిందో రోజులెలా గడిచాయో కూడా నాకు తెలీదు. మగతగా నిద్రలోకి జారుకోవడం, మెలకువ వస్తే వెక్కివెక్కి ఏడవడం- అంతే. ఎటుచూసినా నా చిట్టితల్లే... దాని అమాయకమైన నవ్వే కనిపించేది. దాదాపు పిచ్చిదాన్నయిపోయాను.

పిల్లల కోసమే వెళ్తాను

నేను కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. నందన లేని లోటుని మెల్లగా సంగీతంతో పూడ్చుకోవడం మొదలుపెట్టాను. పేదకళాకారుల కోసం మా పాప పేరుతో ‘స్నేహ నందన’ ట్రస్టు మొదలుపెట్టాను. దాని ద్వారా సుమారు పాతికమంది కళాకారులకి నెలనెలా పెన్షన్‌ ఇస్తున్నాను. అంతేకాదు, అప్పటి నుంచీ టీవీ పాటల పోటీలకి న్యాయనిర్ణేతగా ఇష్టంగా వెళుతున్నాను. నిజానికి, షూటింగుల్లో ఉండే దుమ్మూధూళీ, లైట్ల వెలుగులూ- ఇవన్నీ నాకు పడవు. అయినా పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనే అలా వెళు తుంటాను. వాళ్ల అల్లరినీ, నన్ను చూడగానే పరుగున వచ్చి ‘చిత్రా అమ్మా’ అంటూ చుట్టుకుపోయే అభిమానాన్నీ ఆనందంగా చూస్తుంటాను. పక్కనే కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పించుకుంటాను. వాళ్లకోసమనే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాను. పిల్లల నోటివెంట ‘చిత్రా అమ్మా’ అన్న పిలుపు విన్న ప్రతిసారీ ‘నా నుంచి ఒకర్ని తీసుకెళ్లినా వందలమంది పిల్లల్నిచ్చావు దేవుడా!’ అనుకుంటూ ఉంటాను.

ఆ భూషణం వాళ్లదే...

పద్మభూషణ్‌ వార్త తెలిశాక నాకుగుర్తొచ్చిన మొదటి పేరు నందనే! పద్మశ్రీ వచ్చినప్పుడు తను నా పక్కనేే ఉన్న క్షణాలని బాధగా నెమరేసుకున్నాను. ఎస్పీబీగారు గుర్తొచ్చి ఆ బాధ మరింత పెరిగింది. తెలుగులో ఎలా పాడాలో నాకు నేర్పిన వారాయన. తెలుగు అక్షరాలు నా చేత దిద్దించారు. చ, ఛ-ని ఎలా పలకాలో బట్టీ పట్టించారు. ఆయన రాసిన ‘అ, ఆ’లు నా పాటల డైరీలో ఇంకా భద్రంగా ఉన్నాయి..! దేశవిదేశాల్లో ఎప్పుడు కచేరీలు చేసినా... ట్రూప్‌లో నేను తప్పనిసరిగా ఉండాలని పట్టుబట్టేవారు. అమ్మానాన్నలూ, నందనా, ఎస్పీబీ, నా గురువులూ... నాకు దూరమైన వీళ్లంతా ఏదోరకంగా నా వ్యక్తిత్వాన్నీ, సంగీతాన్నీ మలచినవారే. వాళ్లు దూరమైనా వాళ్ల జ్ఞాపకాలు నన్ను శిల్పంలా చెక్కుతూనే, వేలుపట్టి ముందుకు నడిపిస్తూనే ఉన్నాయి, ఉంటాయి. ఈ ‘పద్మభూషణ్‌’ మాత్రమే కాదు, నా జీవితం మొత్తం వాళ్లకే అంకితం!

నేనూ... వాళ్లూ!

రెహ్మాన్‌: రోజాలోని ‘నాగమణీ... నాగమణీ!’తో మొదలైంది రెహ్మాన్‌తో నా ప్రయాణం. అక్కడి నుంచి ‘మనసే తీయగా’(ఓకే బంగారం) దాకా మా కాంబినేషన్‌లో వచ్చిన పాటలు అక్షరాలా నూటపదహార్లు! ‘బొంబాయి’ హిందీ వెర్షన్‌ కోసం నేను పాడిన ‘కెహనాహి క్యా’ (తెలుగులో ‘కన్నానులే కలయికలు...’) పాటని ప్రసిద్ధ గార్డియన్‌ ఆంగ్ల పత్రిక ‘చనిపోయేలోపు వినాల్సిన 1000 పాటలు’ జాబితాలో చేర్చడం మా కాంబినేషన్‌కి దక్కిన అతిపెద్ద గౌరవం!

ఆమె పాటల వేదం!: చిన్నప్పుడు మా తమ్ముడికి ఉయ్యాలూపుతూ ‘ప్రియతమా... ప్రియతమా’ పాట పాడానని చెప్పాను కదా! అది సుశీలమ్మగారిదే. ఆ రకంగా ఆమె పాటతోనే సంగీతరంగంలోకి వచ్చాన్నేను. నేనో ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పగా విని... ఇంటికి పిలిచి మరీ ఆమె పాడిన పాటలు నాచేత పాడించుకుని ఆనందించారు! ఆమె ప్రతిపాటా ఓ వేదంలా అభ్యసించాల్సిందేనని నమ్ముతాన్నేను.

అమ్మ... ఓ పుస్తకం: తెలుగూ, తమిళంలో పాడటం మొదలుపెట్టిన తొలిరోజుల్లో పాటకు తగ్గ భావాన్ని ఎలా వ్యక్తీకరించాలో నేర్చుకున్నది జానకిగారి పాటలతోనే! ఓసారి కచేరీ చేస్తుంటే జానకిగారు అకస్మాత్తుగా వేదికపైకి వస్తే బిత్తరపోయి... నోటమాట రాలేదు నాకు. ‘నీలాంటి కూతురు నాకుంటే ఎంత బావుణ్ణమ్మాయ్‌!’ అన్నారు ఆలింగనం చేసుకుంటూ!

ఇదీ చదవండి: ఆ ముగ్గురిలో విజయ్​తో నటించేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.