కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. నిన్నటి నుంచి ఆయన ఆహారం తీసుకుంటున్నారని, రోజులో 15-20 నిమిషాలు వైద్యుల సాయంతో లేచి కూర్చొంటున్నారని తెలిపారు. ఈ మేరకు ఎస్పీబీ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ప్రత్యేక వీడియో సందేశంలో పంచుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నాన్న ఆరోగ్యంపై సెప్టెంబరు 16న అప్‌డేట్ ఇచ్చాను. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఇంకా ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ఇతర ఇన్‌ఫెక్షన్‌లూ లేవు. అయితే, ఆయన ఊపిరితిత్తుల పనితీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. శ్వాస మరింత తేలికగా తీసుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. వైద్యులు ఆయనకు ఫిజియోథెరపీని కొనసాగిస్తున్నారు. 15-20 నిమిషాల పాటు ఆయన లేచి కూర్చొంటున్నారు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేం. నిన్నటి నుంచి నాన్న ఆహారం తీసుకుంటున్నారు. ఇది ఆయన ఇంకాస్త త్వరగా కోలుకునేందుకు సహాయ పడుతుందని ఆశిస్తున్నాం. నాన్న ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన వారిందరికీ మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నా" అని ఎస్పీ చరణ్ అన్నారు.
కరోనా వైరస్ సోకడం వల్ల ఆగస్టు 5న బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడం వల్ల వైద్యులు వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలంగానే అందరూ సంతోషం వ్యక్తంచేశారు. బాలు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.