వాస్తవికంగా ఆలోచించండి:
చాలామంది తల్లిదండ్రులు...తమ పిల్లలు దూసుకుపోవాలనుకుంటారు. వారి వాస్తవిక సామర్థ్యాలను అంచనా వేయడంలో విఫలమవుతుంటారు. అప్పుడే మీ అంచనాలకు, వారి ఆలోచనలకు మధ్య వైరుధ్యం ఏర్పడుతుంది. అలాకాకుండా మీ చిన్నారి ఇష్టాయిష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తరువాతే వారి స్థాయికి తగిన లక్ష్యాలను ఇవ్వండి.
ప్రశంసించండి:
కొందరు తమ పిల్లల్ని ఇతరులతో పోలుస్తుంటారు. వారిలా చేయలేదనీ ఎందుకూ పనికిరావనీ తిడుతుంటారు. ఇవి ఆ చిన్ని మనసులని గాయం చేస్తాయి. అలా కాకుండా వాళ్లు మంచి పని చేసినప్పుడు ప్రశంసించండి. అవి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
ఓటమి రుచీ తెలిసేలా:
జీవితంలో ఉన్నతంగా ఎదగాలనీ, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనీ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయినంత మాత్రాన ప్రతి విషయంలోనూ వారు గెలుపు గుర్రాలవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కో మెట్టూ ఎక్కడం, కష్టం విలువ తెలుసుకోవడంతోపాటు...ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోగలిగేలా వారిని సన్నద్ధం చేయాలి. అప్పుడే వారు ఆత్మన్యూనత నుంచి బయటపడగలుగుతారు. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను సానబెట్టుకోవడం, అప్‌డేట్‌గా ఉండటం వారికి నేర్పిస్తే...జీవితంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు.