‘ప్రతి పనికి పీక్ స్టేజ్ ఉంటుంది. పర్వతారోహకుడికి ఎవరెస్ట్ అధిగమించడం అంతిమ లక్ష్యం. అలా ఫిట్‌నెస్‌లో సిక్స్‌ప్యాక్ శిఖరం. నేను జిమ్‌లో చేరిన కొన్నాళ్లకు దాని అంతు చూడాలనుకున్నా’ ఇదీ వర్లు మాట. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా పోలీసులు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, విద్యార్థులు, పైలెట్లు.. లక్షలమందికి శిక్షణనిచ్చారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాదు.. ఫిట్‌నెస్ పరంగానూ మార్గదర్శిగా ఉండాలనుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో వచ్చిందీ ఆలోచన. రెండు నెలలు సొంతంగా సాధన చేశాక ఫిట్‌నెస్ నిపుణుడి దగ్గర శిక్షణ తీసుకోవాలనుకున్నారు. ట్రైనర్ వెంకట్ దగ్గరికి వెళ్లారు. జిమ్‌లో చేరారు. రెండు నెలలు మామూలుగానే సాగింది. చిన్నచిన్న కసరత్తులతో సర్దుకుపోవడం ఏంటి? అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సిక్స్ ప్యాక్ చేయాలనే సంకల్పం మొదలైంది.
కఠోర వ్యాయామాలతో..
ఆరు పలకలు.. అంత తేలికేం కాదు. పైగా ఆరు పదుల వయసులో. దీనికోసం కఠోర వ్యాయామాలు చేయాలి. కచ్చితమైన డైట్ పాటించాలి. మొదట్లో చిన్నగా మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా వ్యాయామాల తీవ్రత పెంచాలి. అవన్నీ జరగాలంటే ముందు గుండె, ఊపిరితిత్తుల పనితీరు బాగుండాలి. వర్లు అంతకుముందు కొన్ని నెలల నుంచి వ్యాయామం చేస్తుండటంతో ఆ ఇబ్బందేం లేకుండా పోయింది. వెంకట్‌తో సిక్స్‌ప్యాక్ మాట చెప్పారు. ‘సరే చేద్దాం’ అన్నారాయన. ముందు ఇలాగే చెప్పి నాలుగురోజులయ్యాక జిమ్ మొహం చూడనివాళ్లు ఎంతోమందిని చూశారాయన. వర్లు అలాంటివారిలో ఒకరనుకున్నారు. ఇరుగూపొరుగూ నెల నిలబడటం కష్టమన్నారు. ఇంట్లోవాళ్లకీ నమ్మకం లేదు.
పట్టువదలని విక్రమార్కుడు..
ఎవరేం అనుకున్నా వర్లు పట్టువదిలే రకం కాదుగా. తన ఆశయం జారిపోకుండా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ముందే జిమ్ ఫీజు కట్టేశారు. నెలలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వెళ్లారు. రెండు నెలలలో తను కోరుకున్నట్టే కండలు పెంచి అందరి ముందు ప్రదర్శించాలనుకున్నారు. కానీ అది ఊహించినంత సులభమేం కాదని తొందర్లోనే అర్థమైంది. రోజురోజుకీ వర్కవుట్ కష్టం ఎక్కువైంది. ఒకానొక సమయంలో సిక్స్‌ప్యాక్ జోలికి వెళ్లకుండా ఉండాల్సింది అనుకున్నారాయన. వెంటనే తనకు తాను సర్దిచెప్పుకొని రెట్టించిన ఉత్సాహంతో కసరత్తులు మొదలుపెట్టేవారు. ఐదు నెలలు చెమట్లు చిందించారు. చివరికి అనుకున్నది సాధించారు. సంకల్పం గట్టిదైతే వయసు ఏదైనా శారీరక పటుత్వం సాధ్యమేనని నిరూపించారు.
ఇలా సాధన
వారానికి ఆరు రోజులు కచ్చితంగా వర్కవుట్ చేశారు. మొదట్లో రోజుకి గంట నుంచి క్రమంగా రెండు గంటలకు పెంచారు. పదిహేను నిమిషాలు ట్రెడ్‌మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్..లాంటి కార్డియో వ్యాయామాలు. మిగతాదంతా వెయిట్ ట్రైనింగ్ కసరత్తులే. డంబెల్స్, కార్బెల్ రాడ్స్‌తో బరువులెత్తేవారు. సిక్స్‌ప్యాక్ కోసం అబ్డామినల్ వర్కవుట్లు ఎక్కువగా చేశారు. లెగ్ రైజెస్, క్రంచెస్, సైడ్ బెండింగ్‌లాంటివి. వెయిట్ ఎక్సర్‌సైజులు చేసినప్పుడు ముందు రెండు కేజీలు బరువులు ఎత్తడంతో మొదలుపెట్టి 20 కేజీల వరకు వెళ్లారు. తక్కువ బరువులు ఎత్తితే ఎక్కువ రెప్యుటేషన్స్ చేసేవారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి మనిషీ వారానికి 150 నిమిషాల వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలి. అది పాటించినా ఫిట్‌గా ఉంటారు. యువత ఏం సాధించాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం బాగుంటే ఆలోచనలు కూడా బాగుంటాయి. మనసు, శరీరం రెండింటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. బరువు, పొట్ట ఎప్పుడైనా తగ్గించుకోగలను అనుకోవద్దు. ముందు నుంచే వ్యాయామం అలవాటుగా ప్రారంభించాలి. జిమ్ చేయలేనివాళ్లు కనీసం ఇరవై నిమిషాలైనా నడిస్తే మంచిది.
ఇదీ డైట్
ఉదయం: 5 ఎగ్‌వైట్స్, ఉడికించిన కూరగాయలు. పాల నుంచి తీసిన పెద్ద చెంచాడు వే ప్రొటీన్. రెండుసార్లు రెండు రకాల పండ్లు. పది వేయించిన లేదా నానబెట్టిన బాదం పప్పులు.
మధ్యాహ్నం: నూనె లేకుండా చేసిన 100 గ్రాముల చికెన్, కూరగాయలు, 50 గ్రాముల అన్నం, 150 గ్రాముల పండ్లు.
రాత్రి: 100 గ్రాముల చికెన్ లేదా 150 గ్రాముల చేపలు, కూరగాయలు.
* మూడు పూటలా కూరగాయలు, కీర దోస, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. కసరత్తులు చేసే సమయంలో ఎక్కువగా నీరు తీసుకున్నారు.
ఇదీ చూడండి: ఉందిలే మంచి కాలం ముందు ముందున!