ఆకస్మిక గుండెపోటు మరణాల(Sudden Cardiac Arrest) సంఖ్య వేగంగా పెరుగుతోందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ(AIG) ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి(Dr. Nageshwar reddy) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రాథమిక జీవిత సహాయ శిక్షణ(Basic life support)ను నిర్వహించడం చాలా అవసరమని పేర్కొన్నారు. తద్వారా ఆకస్మిక గుండెపోటు సంభవించిన వారి ప్రాణాలను కాపాడవచ్చని ఆయన చెప్పారు.
ఏఐజీ(AIG) ఆస్పత్రికి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఆకస్మిక గుండెపోటు సంభవించినప్పుడు ఏ విధంగా చికిత్స అందించి మనిషి ప్రాణాలను కాపాడవచ్చు అనే అంశంపై 1000 మందికి శిక్షణ ఇచ్చినట్లు డా. నాగేశ్వర్ రెడ్డి వివరించారు. వీరందరినీ హార్ట్ మార్షల్స్గా పిలుస్తారు. గుండెపోటు(heart attack) వస్తే ప్రాథమిక చికిత్స సీపీఆర్(cardiopulmonary resuscitation) ఎలా అందించాలి అనే అంశంపై వీరికి శిక్షణ కొనసాగింది.
ప్రపంచ హృదయ దినోత్సవం(world heart day)సందర్భంగా హార్ట్ మార్షల్స్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఆరు నెలల్లో మరో పది వేల మందికి శిక్షణనిచ్చి హార్ట్ మార్షల్స్గా తీర్చిదిద్దినున్నట్లు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.
సమాజంలో రోజురోజుకీ ఆకస్మిక గుండెపోటు మరణాల సంఖ్య పెరుగుతోంది. వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్రతి ఒక్కరికీ సరైన అవగాహన అవసరం. అందుకే గుండెపోటు సంభవిస్తే ప్రాథమిక చికిత్స( (సీపీఆర్-cardiopulmonary resuscitation) ) అందించాలో ప్రాథమిక జీవిత సహాయ శిక్షణ ద్వారా..మొదటి దశలో 1000 మందికి శిక్షణ అందిస్తున్నాం. హౌసింగ్ సొసైటీల్లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి మొదటి దశలో శిక్షణ ఇస్తున్నాం. వీరు 24గంటలూ విధుల్లో ఉంటారు కాబట్టి.. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అప్రమత్తంగా ఉండొచ్చు. ఆరు నెలల్లో మరో 10 వేల మందికి శిక్షణనిస్తాం. -డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఏఐజీ ఛైర్మన్
గుండెపోటు సంభవించినప్పుడు ఒక్క నిమిషం ఆలస్యమైనా.. రోగి మరణించే అవకాశాలు 10శాతం ఉన్నాయి. ఆ సమయంలో ప్రాథమిక చికిత్స (సీపీఆర్-cardiopulmonary resuscitation) అందించకపోతే ఆ వ్యక్తి 10నుంచి 15నిమిషాల కంటే ఎక్కువ సేపు బతకలేడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు సీపీఆర్ అందించినట్లయితే కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. -డాక్టర్ నరసింహన్, ఏఐజీ సీనియార్ కార్డియాలజిస్ట్
మధుమేహం(Diabetes)తో బాధపడుతున్న వారు గుండెపోటు పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వారికి ఛాతి నొప్పి లాంటి లక్షణాలు లేకపోయినా హార్ట్ ఎటాక్‌కు గురయ్యే అవకాశం ఉంది. చాలా మంది శ్వాస ఆడకపోవడం, ఛాతి నొప్పి, తల తిరగడం, వాంతులు, గుండె దడ, విపరీతమైన అలసట, చెమటలు పట్టడం లాంటి వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఇవి గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు గుండెపోటుకు హెచ్చరికలుగా భావించి ముందస్తు చికిత్స తీసుకోవడం అవసరం. - డా. రాజీవ్ మీనన్, కార్డియాలజీ క్లినికల్ డాక్టర్, ఏఐజీ
శిక్షణా సమయంలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తాం. రెండో దశలో సామాన్యులతో పాటు, పబ్లిక్ పార్కులు, మెట్రో, రైల్వే స్టేషన్లలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణనిస్తాం. ప్రతి ఒక్కరూ దీన్ని సామాజిక బాధ్యతగా భావించి గుండెపోటుకు గురైన వారికి సీపీఆర్(cardiopulmonary resuscitation) ఎలా చేయాలో తెలుసుకోవాలి. -డా. జీవీ రావు, ఏఐజీ
ఇదీ చదవండి: World Heart Day:గుండె వ్యాధుల తీవ్రత అధికంగా భారత్‌లోనే!