చాలామంది అమ్మాయిలు పెళ్లి తర్వాత బరువు పెరుగుతుంటారు. అయితే ఇందుకు చాలా రకాల కారణాలే ఉంటాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ లేదా కుటుంబ సభ్యులంతా కలిసి ఇతర పార్టీలకు హాజరవడం, బంధువుల ఇళ్లకు వెళ్లడం, వారాంతాల్లో బయట తినడం, వ్యాయామానికి తగిన సమయం కేటాయించకపోవడం.. ఇలా కారణాలేవైనా వారి లైఫ్‌స్త్టెల్‌లో మార్పులొచ్చి బరువు పెరగడం మనం గమనిస్తూనే ఉంటాం. దీంతో వారు అటు శారీరకంగా, ఇటు మానసికంగా దృఢత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. మరి ఇలా జరగకుండా ఉండాలంటే పెళ్లి తర్వాత ఫిట్‌నెస్‌పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవేంటో తెలుసుకుందాం రండి..
ఒత్తిడి వద్దు..
కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య అప్పుడప్పుడూ అపార్థాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. అలాగే కొత్తగా పెళ్లయిన అమ్మాయికి రకరకాల భయాలు కూడా ఉంటాయి. అయితే ఇలాంటి విషయాలు మరీ లోతుగా ఆలోచిస్తే మానసిక ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతాయి. బరువు పెరగడానికి ఒక రకంగా ఇవి కూడా కారణం కావచ్చు. ఈ సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి చాక్లెట్లు, కొవ్వులు అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి శరీరంలో అనవసర కొవ్వులు పేరుకునేలా చేస్తాయి. అందువల్ల మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలాంటి పదార్థాలను తినడం కంటే ఇద్దరూ కలిసి మాట్లాడుకుని గొడవలు రాకుండా చూసుకోవడం మంచిది. తద్వారా ఒత్తిళ్ల నుంచి విముక్తి పొందడంతో పాటు బరువు కూడా పెరగకుండా చూసుకోవచ్చు.
ఇంటి ఆహారమే..
చాలామంది అమ్మాయిలు పెళ్లికి ముందు వంట నేర్చుకోకపోవడం వల్ల పెళ్లి తర్వాత వంట చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొంతమందైతే ఏకంగా బయట నుంచి తెప్పించుకుంటారు. ఇంకొంతమంది అటు ఇంటి పనులు, ఇటు ఆఫీసు పనులు.. రెండింటినీ సమన్వయం చేసుకోలేకపోవడంతో వంట చేసుకోవడానికి సమయం సరిపోక బయటే తినేస్తుంటారు. ఇలా ఎప్పుడో ఒకసారి చేస్తే ఫర్వాలేదు.. కానీ రోజూ బయట తినడం వల్ల ఆయా ఆహార పదార్థాల్లోని అదనపు క్యాలరీలు, నూనెల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి లావయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి బయట ఫుడ్‌కి స్వస్తి చెప్పి ఇంట్లోనే నెమ్మదిగా వంట చేసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం బోలెడన్ని వంటకాలు, వాటి తయారీ విధానాలు ఆన్‌లైన్లోనే లభిస్తున్నాయి. అవసరమైతే వాటిని కూడా ఫాలో అవ్వచ్చు. ఇలా ఇద్దరూ కలిసి స్వయంగా తక్కువ క్యాలరీలుండే ఆహార పదార్థాలతో వంట చేసుకోవడం వల్ల బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.
కలిసి చేయండి..
బరువు పెరగకుండా కాపాడడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే అతి ముఖ్యమైన అలవాటు వ్యాయామం. ఇది ప్రతిఒక్కరికీ చాలా అవసరం కూడా! కాబట్టి ఉదయం లేదా సాయంత్రం ఇద్దరూ కలిసి కాసేపు నడక, వ్యాయామం, యోగా చేయచ్చు. లేదా ఇద్దరూ కలిసి ఓ జిమ్ సెంటర్లో చేరొచ్చు. తద్వారా శరీరానికి చక్కటి వ్యాయామం అంది బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.
ఇవి మంచివి!
బరువు అదుపులో ఉంచుకోవడానికి తాజా పండ్లు, కూరగాయలు.. వంటివి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తినడం అలవాటు చేసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గాను, సాయంత్రం స్నాక్స్‌గాను వీటిని తీసుకోవచ్చు. అలాగే ప్రత్యేకించి పచ్చికూరగాయలతో రసాలు తయారుచేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బరువు పెరగకుండా కాపాడుతుంది.
ఇవీచూడండి:నేడు మూడో దశ పంచాయతీ ఎన్నికలు