"బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ" అంటూ క్రికెటర్లు సచిన్, ధోని, కోహ్లీ కనిపించే ప్రచార ప్రకటనలు పిల్లలకే కాదు వారి తల్లిదండ్రులకూ సుపరిచితమే. బూస్ట్ తాగితే తమ చిన్నారులూ క్రీడాకారుల్లా బలంగా తయారవుతారని వారి నమ్మకం. అంతేకాదు ఎంత ధర ఉన్నా కొని తెచ్చి పిల్లలకు తాగిస్తుంటారు కూడా. ప్రముఖుల ప్రకటనలు అంత లోతుగా వెళ్తాయి ప్రజల మనసుల్లోకి.
ప్రజల్లో ఉన్న ఈ నమ్మకాన్నే కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతులు లేకుండా ప్రముఖుల ఫొటోలను ప్రకటనల్లో వాడుతూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఈ కోవకే వస్తుంది హైదరాబాద్లోని శ్రీమాన్ క్లాతింగ్ షాపు. విరాట్ కోహ్లీ ఫొటోతో తమ ఉత్పత్తులపై పత్రికల్లో ప్రకటనలిస్తూ వీళ్లు వ్యాపారం పెంచుకునే ప్రయత్నం చేశారు. కొన్నాళ్లు ఇది జనాల్లోకీ వెళ్లింది.
చివరికి.. ఉస్మానియా యూనివర్సిటీ లా విద్యార్థి ఆకాశ్ కుమార్ చొరవతో విషయం వెలుగులోకి వచ్చింది. అసత్య ప్రచారం చేస్తూ మోసం చేస్తున్నారంటూ తెలంగాణ వినియోగదారుల సలహా కేంద్రంలో ఫిర్యాదు చేశాడు ఆకాశ్. నిబంధనలకు విరుద్ధంగా కోహ్లీ ఫొటోను ప్రచారానికి వాడుకున్నారని ఫిర్యాదులో చెప్పాడు.
వేగంగా స్పందించిన వినియోగదారుల సలహా కేంద్రం అధికారులు.. షాపు యాజమాన్యానికి నోటీసులు పంపించారు. తప్పును అంగీకరించిన యజమానులకు 10వేల జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ద్వారా ఫిర్యాదుదారుడికి అందించారు. సలహా కేంద్రం సేవలకు మెచ్చిన ఆకాశ్.. ఆ మొత్తాన్ని తెలంగాణ వినియోగదారుల సలహా కేంద్రానికి విరాళంగా అందించారు.