తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పుతండా శివారులో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని కుమ్మరికుంట్లకు చెందిన ఏరుకొండ రాంబాబు(22), నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెం గ్రామానికి చెందిన నిదానపల్లి మహేష్(21) దగ్గరి బంధువులు. కుమ్మరికుంట్లలో జరగనున్న ఓ వివాహానికి మహేష్ గ్రామానికి వచ్చాడు. సాయంత్రం ఇద్దరూ కలిసి పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై దంతాలపల్లికి వెళ్లారు.
అక్కడ పని ముగించుకుని అదే ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో తూర్పుతండా శివారులో రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వీరి ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తూ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన రాంబాబు, మహేష్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ,సీఐ కరుణాకర్ పరిశీలించారు. అంతకు ముందు కళ్లెదుట కనిపించిన కుమారులు కొంత సమయానికే మృత్యువాత పడటం వల్ల వారి తల్లిదండ్రులు రోధించినతీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
ఇదీ చదవండి:
కక్ష సాధింపులో భాగంగానే ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్: చంద్రబాబు