అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా అధికారి శ్రీనివాస్ రెడ్డి వేధిస్తున్నారంటూ రిసోర్స్ పర్సన్ ఫరీదా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
డబ్బులు డిమాండ్..
ఫరీదా విద్యార్హత ధ్రువపత్రాలను అంతర్జాలంలో అప్లోడ్ చేయడానికి సంఘాల సభ్యుల చేత డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకుండా.. ముఖ్యమంత్రికి ఎందుకు అర్జీ పెట్టుకున్నావంటూ సదరు అధికారి బాధితురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ విషయం తెలియదన్నా వినలేదు..
అర్జీ విషయం తనకు తెలియదని ఎంత చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదని బాధితురాలు వాపోయింది. ఈ కారణంగా రిసోర్స్ పర్సన్‌గా నిన్ను కొనసాగించేది లేదంటూ శ్రీనివాస్ రెడ్డి అంటున్నారని బాధితురాలు వాపోయింది. ఉపాధి కోల్పోతే తన కుటుంబాన్ని పోషించుకోలేనని చెప్పినా.. ఆయన వినిపించుకోకపోవడంతో మంగళవారం సాయంత్రం మెప్మా అధికారి ఎదుటే పురుగుల మందు తాగినట్లు ఆమె పేర్కొన్నారు.
స్పందించిన సంఘాలు..
స్పందించిన సంఘాల సభ్యులు తనను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు బాధితురాలు వెల్లడించింది. అధికారి శ్రీనివాస రెడ్డిపై కేసు పెట్టవద్దని, ఇతర మెప్మా అధికారులు, సంఘాల సభ్యులుతనపై ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు వాపోయింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఇవీ చూడండి : 'అమరావతి'పై వాదనలు.. రిట్ పిటిషన్ల విభజనకు హై కోర్టు ఆదేశం