తెలంగాణ .. జంట నగరాల్లో భద్రతపై 'దిశ' హత్యోదంతంతో దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల మంది ఐటీ ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేస్తున్న నగరంలో ముఖ్యంగా మహిళల రక్షణపై పోలీసుల చర్యలు నీటి మూటలుగా తేలాయి. టోల్‌గేట్‌కు కూతవేటు దూరంలో ఘోరం జరిగినా... కనీసం గుర్తించలేకపోవటం ఆర్భాటపు ప్రకటనలను వెక్కిరిస్తున్నాయి. వరుస ఘటనలతో మహిళలు ధైర్యంగా బయటకు వెళ్లాలంటేనే హడలిపోయే దుస్థితి నెలకొంది. రాత్రి 7 దాటిందంటే సిటీలోకి వచ్చే రహదారులన్నీ భయంకరంగా మారుతున్నాయి.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా
బాహ్యవలయ రహదారి హైదరాబాద్ నగరానికే తలమానికం. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వేల వాహనాలు నగరం లోపలికి రాకుండా బయట నుంచే వెళ్లిపోయే విధంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. 158 కిలోమీటర్లు ఉండే ఈ రహదారి ఇప్పుడు అనేక అసాంఘిక, హింసా కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. బాహ్య వలయ రహదారిపై శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకూ మాత్రమే హైవే పెట్రోలింగ్, ట్రాఫిక్ పెట్రోలింగ్, పర్యవేక్షణ, విద్యుత్ దీపాలు ఉన్నాయి. శంషాబాద్ నుంచి విజయవాడ వైపు రహదారి.. దాని పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై వెళ్లే వాళ్లు ప్రాణాలు అరచేత పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. కటిక చీకటి.. రోడ్డుపై ఏ దోపిడీ దొంగలు ఉంటారోనని సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఆందోళన దిశ ఘటన తర్వాత మరింత ఎక్కువైంది.
విచ్చలవిడిగా మద్యం షాపులు
బయటి ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశించాలంటే రాత్రి పది గంటల వరకు ఆగాల్సిందే. ఇలా నగరంలోకి వచ్చే టోల్ బూత్ వద్ద తాజాగా చాలా బార్లు, వైన్ షాపులు వెలిశాయి. దూర ప్రాతాల నుంచి టోల్ బూత్‌లకు ముందుగానే చేరుకునే లారీలకు ఈ బార్లు, మద్యం దుకాణాలు అడ్డాలుగా మారుతున్నాయి. రాత్రి వరకూ తాగి అక్కడే భోజనం చేసి మెల్లగా రాత్రి నరగంలోకి వస్తున్నారు. సిటీలో రాత్రి 10 గంటల తర్వాత ట్రాఫిక్ పోలీసులు గానీ ఆర్టీఏ అధికారులు గానీ కనిపించరు. తాగి వాహనాలు, లారీలు నడుపుతున్న వారిని ఆపే వారే ఉండరు. ఇలా మద్యం మత్తులో వాహనాలు నడిపి చాలా మంది అమాయకుల మరణాలకు కారణం అవుతున్నారు. ఇప్పటికైనా బాహ్య వలయ రహదారిపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అవసరం. ఘటన జరిగినపుడు అయ్యో అనడం కంటే ముందుగా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకూ దిశ లాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయవచ్చునని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: