భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్థలతో నాలుగేళ్ల కన్నకూతురిని హతమార్చిన.. ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం బి తాళ్లవలసలో చోటు చేసుకుంది. తాళ్లవలస గ్రామానికి చెందిన బంక శ్రీనుకు పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామానికి చెందిన మహాలక్ష్మికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరగడంతో భార్యను నాలుగేళ్ల క్రితమే పుట్టింటికి పంపేశాడు శ్రీను. లారీ డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీను తన పెద్ద కుమార్తెతో తాళ్లవలసలోనే ఉంటున్నాడు.
భార్యతో గొడవలు జరిగిన తర్వాత ఆమె దగ్గరకు ఒకటి రెండుసార్లు మాత్రమే వెళ్లాడు. భార్య రెండోసారి గర్భం దాల్చిందని తెలిసిన తరువాత ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. అప్పటినుంచి చూసేందుకు కూడా వెళ్లలేదు. పెద్ద మనుషులతో అనేకసార్లు రాజీ కుదిర్చేందుకు వచ్చినా వినలేదు. ఇటీవల పెద్దల సమక్షంలో ఒప్పందం ప్రకారం చిన్న కుమార్తె రమ్యని తీసుకొని మహాలక్ష్మి తాళ్లవలసకు వచ్చింది. అప్పటినుంచి కుమార్తెను వదిలించుకోవాలంటూ భార్యపై శ్రీను అనేకమార్లు ఒత్తిడి తెచ్చేవాడు. ఏమి చేయాలో తోచకపోవడంతో మహాలక్ష్మి తీవ్ర మనస్థాపం చెందింది. ఆదివారం తెల్లవారుజామున తన కుమార్తెను తీసుకొని సమీపంలో తన పొలంలో ఉన్న బావి వద్దకు చేరుకొని తన కూతురుతోపాటు తానూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
బావి దగ్గరికి వెళ్లిన మహాలక్ష్మి తన కుమార్తెను బావిలో పడేసిన తరువాత.. కళ్ల ముందే రమ్య ఆర్తనాదాలు విని భయపడి తన ఆత్మహత్య నిర్ణయాన్ని విరమించుకుంది. తాను చేసిన ఘోరాన్ని ఎవరికీ చెప్పకుండా ఇంటికి తిరిగి వచ్చేసింది. తెల్లారేసరికి పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాలు వెతికారు. చివరికి సమీపంలో ఉన్న బావిలో శవమై కనిపించింది రమ్య. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తన భర్త ఒత్తిడి మేరకే ఇలా చేశానని పోలీసులతో మహాలక్ష్మి చెప్పింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్ఛార్జి సీఐ లక్ష్మణ్ రావు తెలిపారు.