ఆకలికి తాళలేక ఓ వ్యక్తి మరణిస్తే.. అయినవారు కానరాక కొందరు నగరంలో బలవన్మరణాలకు పాల్పడారు. లాక్‌డౌన్ కారణంగా తినడానికి తిండి దొరక్క ఆకలితో అలమటించాడు ఓ వ్యక్తి (40). అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమార్ కథనం ప్రకారం.. వడదెబ్బ కూడా తగలడంతో మృతిచెందాడు. అంబర్‌పేట అలీ కేఫ్ చౌరస్తాలో బుధవారం సాయంత్రం శవమై కనిపించాడు.
కుమారుడు రాలేదని తల్లి ఆత్మహత్య
విదేశాల్లో ఉన్న కుమారుడు లాక్‌డౌన్ వల్ల రాలేకపోవడం వల్ల మానసికంగా కుంగిపోయిన ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. చిక్కడపల్లి వివేక్‌నగర్‌కు చెందిన లక్ష్మి, బాలరాజు దంపతుల కుమారుడు సతీష్‌కుమార్ కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. మార్చిలో హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపాడు. లాక్‌డౌన్ కారణంగా రాలేకపోవడంతో ఆ తల్లి బెంగ పెట్టుకుని బుధవారం తెల్లవారుజామున యాసిడ్ తాగి కూతురికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె వెంటనే వచ్చి తల్లిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
మానసిక వేదనతో వలస కార్మికుడు
మానసిక వేదనతో ఓ వలస కార్మికుడు ఉరేసుకున్నాడు. ఒడిశాకు చెందిన పింకు రియాల్(21) పంజాగుట్టలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. వసతి గదిలో ఉంటున్నాడు. బుధవారం ఉదయం గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కన్పించాడు. మానసిక స్థితి సరిగా లేదని తోటి కార్మికులు తెలిపారు.
సొంతూరికి వెళ్లలేననే బెంగతో వృద్ధుడు..
లాక్‌డౌన్‌తో సొంతూరికి వెళ్లలేక పోతున్నాననే బెంగతో వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూర్యాపేటకు చెందిన వెంకన్న(75) బర్కత్‌పుర రత్నానగర్‌లో కుమారుడు వీరేశం వద్దకు లాక్‌డౌన్‌కు ముందు వచ్చాడు. తరువాత సొంతూరికి వెళ్లలేక ఆ బెంగతో మంగళవారం రాత్రి ఉరేసుకున్నాడు.
ఇంటికి వెళ్లడం కుదరక యువతి..
ఇంటికి వెళ్లడం కుదరడం లేదనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలేనికి చెందిన ఆకుల శ్రీవల్లి (20) మణికొండలోని ఓ అపార్టుమెంట్ 15వ అంతస్తులో ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఆమె సోదరి వారంక్రితం మగబిడ్డకు జన్మనివ్వగా చూసేందుకు వస్తానంటూ తల్లికి ఫోన్ చేస్తే లాక్‌డౌన్ కారణంగా వద్దంది. బుధవారం మరోసారి అడిగినా వద్దనడంతో మనస్తాపంతో 15వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకి ప్రాణాలు వదిలింది.
ఇవీ చూడండి: