అమెరికాలో తరచూ జరిగే సామూహిక కాల్పుల ఘటన క్రమంగా ఐరోపాకు విస్తరిస్తోంది. గత వారం నార్వేలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం సహా 20 మందికి పైగా గాయపడ్డ సంఘటన మరవక ముందే దాని పొరుగుదేశం డెన్మార్క్‌లోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగెన్‌లోని ఫీల్డ్స్ ప్రాంతంలోని రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయపడ్డారు. సంఘటనతో షాపింగ్ మాల్ వద్ద భయానక వాతావరణం ఏర్పడింది. కాల్పుల శబ్దం వినిపించగానే అక్కడి వారిలో కొందరు దుకాణాల్లో దాక్కోగా, మరికొందరు తొక్కిసలాట మధ్య పరుగులు తీశారు.
కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో ఘటనాస్థలిని చుట్టుముట్టారు. అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. ఈ సంఘటనలో డెన్మార్క్‌కు చెందిన 22ఏళ్ల అనుమానితుడిని అరెస్టు చేశారు. అనుమానితుడు పొడవాటి షార్ట్ ధరించి చేతిలో తుపాకీ కల్గి ఉన్నట్లు డానిష్ మీడియా తెలిపింది. సంఘటన వెనక అసలు ఉద్దేశంపై ఆరా తీస్తున్నామని కోపెన్‌హగెన్ పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోని రాయల్ ఎరీనా ప్రాంతంలో ఓ వేడుక జరగాల్సి ఉండగా, దాన్ని రద్దు చేశారు. డెన్మార్క్ రాజు ఫ్రెడ్రిక్....ఫ్రాన్స్ సైక్లింగ్ బృందంతో జరగాల్సిన విందు కూడా రద్దైంది. కాల్పుల ఘటన తీవ్రమైదని కోపెన్‌హగెన్ మేయర్ సోఫీ హెచ్. అండర్‌సన్ అన్నారు.
ఇదీ చదవండి: టీచర్‌తో స్టూడెంట్ అఫైర్.. అలా చేయమన్నందుకు రాడ్‌తో కొట్టి!