Sri Lanka New Prime Minister: శ్రీలంకలో రాజకీయ అస్థిరతకు తాత్కాలికంగా తెరపడింది! ఆ దేశ నూతన ప్రధాన మంత్రిగా ప్రతిపక్ష నేత రణిల్ విక్రమసింఘె (73) బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో నాలుగుసార్లు ప్రధానిగా పనిచేశారు. తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం కారణంగా దేశమంతటా పెల్లుబికిన నిరసనలకు తలొగ్గి ప్రధాని పదవికి మహీంద రాజపక్స సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం నూతన ప్రధానమంత్రి నియామక ప్రక్రియకు ఉపక్రమించిన దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) అగ్రనేత విక్రమసింఘెతో బుధ, గురువారాల్లో రహస్యంగా భేటీ అయ్యారు. ఆయన్ను దేశ 26వ ప్రధానిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే విక్రమసింఘె ప్రమాణస్వీకార కార్యక్రమూ పూర్తయింది.
శ్రీలంక పార్లమెంటులో మొత్తం స్థానాల సంఖ్య 225. దేశంలో అత్యంత పురాతన పార్టీగా పేరున్న యూఎన్‌పీకి ప్రస్తుతం అందులో ఒకే ఒక్క స్థానం ఉంది. వాస్తవానికి 2020 పార్లమెంటరీ ఎన్నికల్లో జిల్లాల నుంచి ఆ పార్టీ ఒక్క స్థానాన్నీ గెల్చుకోలేకపోయింది. పార్టీకి గట్టి పట్టున్న కొలంబో నుంచి పోటీ చేసిన విక్రమసింఘె కూడా పరాజయం పాలయ్యారు. అయితే జాతీయ స్థాయిలో వచ్చిన మొత్తం ఓట్ల ఆధారంగా యూఎన్‌పీకి కేటాయించిన సీటు ద్వారా ఆయన పార్లమెంటులోకి ప్రవేశించగలిగారు. పధానిగా ఆయన నియామకానికి తాజాగా అధికార శ్రీలంక పొడుజానా పేరామునా (ఎస్‌ఎల్‌పీపీ) పార్టీ నేతలు, విపక్ష సమాగి జన బలవేగయా (ఎస్‌జేబీ) పార్టీలోని ఓ వర్గం నాయకులు, పలు ఇతర పార్టీల ఎంపీలు పార్లమెంటులో మద్దతు పలికినట్లు తెలిసింది. విక్రమసింఘెతో కలిసి పనిచేసేందుకు భారత్ ఎదురుచూస్తోందని కొలంబోలో భారత హైకమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంతకుముందు ప్రధాని పదవిని చేపట్టాల్సిందిగా గొటబాయ అందించిన ఆహ్వానాన్ని మాజీ ఉప ప్రధానమంత్రి, ఎస్‌జేబీ నేత సాజిత్ ప్రేమదాస తిరస్కరించారు.
సుదీర్ఘ అనుభవశాలి: విక్రమసింఘె 1948లో జన్మించారు. 28 ఏళ్ల వయసులో తొలిసారి ఎంపీగా గెలుపొందారు. 45 ఏళ్లుగా పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తొలిసారి 1993-94 మధ్య, తర్వాత 2001-04, 2015-18 మధ్య కాలంలో ప్రధానిగా పనిచేశారు. 2018 అక్టోబరులో అప్పటి దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన.. ప్రధాని పీఠం నుంచి విక్రమసింఘెను తప్పించారు. ఫలితంగా దేశంలో రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తింది. సుప్రీంకోర్టు జోక్యంతో- రెండు నెలల తర్వాత మళ్లీ విక్రమసింఘె ప్రధాని పీఠమెక్కారు. ఆయనకు భారత్‌తో, ప్రధాని నరేంద్ర మోదీతో సన్నిహిత సంబంధాలున్నాయి. తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థను.. దూరదృష్టి గల విధానాలతో తిరిగి పట్టాలెక్కించేందుకు, ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సహకారాన్ని కూడగట్టేందుకు విక్రమసింఘె సమర్థుడని శ్రీలంక పార్లమెంటులో ఎక్కువ మంది నేతలు విశ్వసిస్తున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈళం (ఎల్‌టీటీఈ)తో విక్రమసింఘె శాంతి చర్చలు జరిపారు. ఓ దశలో ఆ సంస్థతో అధికారాన్ని పంచుకునేందుకూ ముందుకొచ్చారు. ఎల్‌టీటీఈ పట్ల మరీ మెతకగా వ్యవహరించారంటూ మహీంద రాజపక్స తదితరులు ఆయనపై పలుమార్లు విమర్శలు గుప్పించారు.
మహీంద విదేశాలకు వెళ్లకుండా నిషేధం: శ్రీలంక తాజా మాజీ ప్రధానమంత్రి మహీంద రాజపక్స, ఆయన కుమారుడు-ఎంపీ నమల్ రాజపక్స, మరో 15 మంది దేశం విడిచి వెళ్లకుండా స్థానిక ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు నిషేధం విధించింది. పాస్‌పోర్టులను తమకు సమర్పించాల్సిందిగా వారిని ఆదేశించింది. కొలంబోలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నవారిపై దాడులకు కారణమయ్యారన్న అభియోగాలకు సంబంధించి మహీంద, మరికొంతమందిపై దర్యాప్తు జరుగుతోంది.
ఖైదీలతో దాడి చేయించారా?: కొలంబోలో సోమవారం ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై దాడి చేసేందుకు వాటరేక ఓపెన్ జైలు శిబిరంలోని పలువురు ఖైదీలను అధికార పార్టీ వర్గాలు ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.
అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థకు మంగళం!: శ్రీలంకలో కార్యనిర్వాహక అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థను రద్దు చేసే అవకాశాలను పరిశీలిస్తానని దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స తెలిపారు. దాని స్థానంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న రాజ్యాంగపర ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటానని.. పార్లమెంటుకు మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు కృషిచేస్తానని చెప్పారు. ట్విటర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించారు. శ్రీలంకలో 1978 నుంచి అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ అమల్లో ఉంది.
ఇదీ చూడండి : పాపం ట్రంప్.. వ్యాపారం సాగక లగ్జరీ హోటల్ విక్రయం