ఇక్కడ కనిపిస్తున్న ఈ వృద్ధురాలి పేరు ఇర్మ్‌గార్డ్ ఫర్చునర్. రెండో ప్రపంచయుద్ధ కాలంలో స్టట్‌థాఫ్ అనే ఓ నాజీ శిబిరంలో టైప్ రైటర్, స్టెనో గ్రాఫర్‌గా పనిచేసింది. తన చేతితో సుమారు 10వేల మంది యుద్ధఖైదీల మరణశాసనాన్ని లిఖించింది. అప్పుడు ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమే. స్టట్‌థాఫ్ శిబిరంలో 1943నుంచి 1945వరకు విధులు నిర్వహించిన ఫర్చునర్ టైప్‌చేసిన ఆదేశాలతోనే 10వేల ఐదు వందలమందికి శిక్ష అమలైంది. హిట్లర్ ఆత్మహత్యతో మారణకాండ ముగిసిన తర్వాత యుద్ధనేరాలకు పాల్పడిన వారిపై విచారణ మొదలైంది. ఈ నేపథ్యంలో ఫర్చునర్‌దే చివరి విచారణ అని జర్మనీ ఇట్జెహో న్యాయస్థానం అభిప్రాయపడింది.
కాన్సన్ట్రేషన్ క్యాంపులో వేలమంది హత్యతో సంబంధం ఉన్న ఫర్చునర్‌ను విచారించిన కోర్టు ఆమెను దోషిగా నిర్ధరించింది. ఈ నేపథ్యంలో ఆమెకు రెండేళ్ల బహిష్కరణ శిక్ష విధించింది. నిజానికి శిక్ష తీవ్రత మరింత ఎక్కువ ఉండాల్సినప్పటికీ...ఆ సమయంలో ఫర్చునర్ వయసు 18ఏళ్లే కావడంతో జువైనల్ చట్టాల ప్రకారమే ఇట్జెహో కోర్టు శిక్ష విధించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఇదే కేసులో స్టట్‌థాప్ శిబిరంలో కమాండెంట్ అధికారిని 1950లో విచారించిన సమయంలో ఫర్చునర్ ప్రధాన సాక్షిగా నిలిచింది. ఆ నాజీ కమాండెంట్ అధికారికి 9ఏళ్ల జైలు శిక్ష విధించారు. విచారణ సమయంలో వీల్‌ఛైర్‌లో కూర్చుని తీర్పును విన్న ఆమె... లేచి జరిగిన దానికి చింతిస్తున్నట్లు అందుకు క్షమాపణ చెబుతున్నానని తెలిపింది. తాను కేవలం ఆదేశాలు టైప్ చేశాను కానీ, వాటిని తను అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
విచారణ సమయంలో ఫర్చునర్ తరఫు న్యాయవాదులు ఆమెకు శిక్ష తప్పించేందుకు యత్నించారు. ఆమె నేరాలు చేసిందనటానికి సరైన సాక్ష్యాధారాలు లేవని వాదించారు. ఇదే కేసులో 2021లో కోర్టులో ఆమె హాజరుకావలసి ఉండగా.. నిందితురాలు ఎక్కడికో పారిపోయింది. కొన్ని గంటల తర్వాత ఆమెను వెతికిపట్టుకున్న పోలీసులు న్యాయస్థానం బోనులో నిలబెట్టారు.