పనస కాయలా కనిపించే ఈ పండు పేరు 'డురియన్'. చూడ్డానికి ఆకర్షణలో రారాజుగా ఉన్నా సువాసనలో మాత్రం జీరోనే. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత దుర్వాసన వెదజల్లే పండ్లలో ఒకటి. రుచిలోనూ అదుర్స్ అనిపించే ఈ ఫ్రూట్.. కుళ్లిందంటే ఆసుపత్రిలో చేరాల్సిందే! అంతటి కంపు కొడుతుంది కాబట్టే ఈ పండు అమ్మకం, రవాణాను చాలా దేశాల్లో నిషేధించారు. తాజాగా జర్మనీలోని ఓ పోస్టాఫీస్‌లో ఈ పండు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అక్కడి సిబ్బంది.
ఇదీ జరిగింది..!
పోస్టాఫీస్‌కు ఓ మోస్తరు బరువున్న ప్యాకేజ్ వచ్చింది. అయితే డెలివరీకి సిద్ధం చేస్తున్న సమయంలో దాన్నుంచి వచ్చిన గ్యాస్ గాఢతకు దాదాపు 12 మంది పోస్టల్ అధికారులు విపరీతంగా వాంతులు చేసుకున్నారు. ఇందులో ఆరుగురికి పరిస్థితి విషమించడం వల్ల ఆసుపత్రికి తరలించారు. ఆ భవనంలోని 60 మందిని తక్షణమే ఖాళీ చేయించారు.
ఈ ఫ్రూట్‌ను న్యూరెంబర్గ్ నుంచి ఓ వ్యక్తి తన 50 ఏళ్ల స్నేహితుడికి పార్శిల్ పంపినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ పండును ఆసియాలోని పలు దేశాల్లో నిషేధించారు. హోటళ్లలో వాడటం, ప్రజా రవాణాలో తరలించకూడదని నిబంధనలూ విధించారు.
అయితే మనుషులను ఇబ్బందులకు గురిచేసే ఈ పండు రుచిలో చాలా బాగుంటుందట. అందుకే దీన్ని 'పండ్లలో రాజా' అని పిలుస్తుంటారు.
డురియన్ పండు ప్రయోజనాలివే..:
- కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
- విటమిన్- బీ6 సమృద్ధిగా ఉంటుంది. మతిమరుపు, గుండె సంబంధిత వ్యాధులకు బాగా పనిచేస్తుంది.
- దంతాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.
- ఒత్తిడి, కుంగుబాటు సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.
- విటమిన్-సీ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.
- జీర్ణక్రియ, బ్లడ్ సుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, లైంగిక సమస్యలను నివారిస్తుంది.
రుచి, ప్రయోజనాలు మెండుగా ఉన్న ఈ పండు.. ధర కూడా వేలల్లోనే పలుకుతుంది. అయితే కుళ్లిందంటే మాత్రం అంతే స్థాయిలో చేటు చేస్తుంది.