అఫ్గానిస్థాన్‌లో శాంతిస్థాపనపై అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే బైడెన్‌కు తాలిబన్లుస్పష్టమైన సంకేతాలు పంపారు. దశాబ్దాల కాలంగా అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న అశాంతిని రూపుమాపేందుకు అమెరికాతో చేసుకున్న దోహా ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇరువురి మధ్య వివాదానికి తెరదించేందుకు 'అమెరికా-తాలిబాన్ ఒప్పందం' అమలు కచ్చితంగా జరగాలని తాలిబన్లు పేర్కొన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా ఒప్పందం అమలుకు సహకరించాలని కోరారు.
దోహా ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నాం. దీంతో అఫ్గాన్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మా అంతర్గత వ్యవహారాలను చర్చల ద్వారా చక్కబెట్టుకుంటాం. కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ ఒప్పందాన్ని గౌరవిస్తారు అని అనుకుంటున్నాం. మేము వ్యక్తితో కాదు అమెరికాతో ఒప్పందం చేసుకున్నాం.
-తాలిబన్ ప్రతినిధి