పంజ్‌షేర్.. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌కు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో హిందుకుష్ పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రాంతం. జనాభా దాదాపు లక్షన్నర. ప్రస్తుతం.. ఈ ప్రావిన్సు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కారణం.. అరాచకాలతో అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు(Afghanistan Taliban) ఇక్కడి ప్రజలు ఎదురొడ్డి నిలవడమే. వారిని ముందుండి నడిపించేంది దిగ్గజ మిలటరీ కమాండర్ అహ్మద్ షా మసూద్ (Ahmed Shah Masood) తనయుడు అహ్మద్ మసూద్(Ahmad Massoud). అసలు వీరికి అంత తెగువ ఎక్కడిది? పంజ్‌షేర్‌లో ఇప్పుడు ఏం జరుగుతోంది?
- అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో ఆగస్టు 15న దేశాన్ని ఆక్రమించుకున్నారు తాలిబన్లు.
- మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.
- తాలిబన్లకు భయపడి.. స్థానికులు, విదేశీయులు కాబుల్ విమానాశ్రయానికి పరుగులు తీశారు. అక్కడ ఇప్పటికీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
- అమెరికా, భారత్, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాలు తమ తమ పౌరుల్ని స్వదేశాలకు తీసుకొచ్చాయి.
- ఐదు సింహాలు అని అర్థం వచ్చే పంజ్‌షేర్ ప్రావిన్సు మాత్రం తాలిబన్లకు ఎదురుతిరిగింది. ముష్కర ముఠాకు హెచ్చరికలు పంపింది.
- నాలుగు గంటల్లో లొంగిపోవాలని తాలిబన్లు ఆల్టిమేటం జారీ చేసినా.. పంజ్‌షేర్ లెక్కచేయలేదు. ప్రతిగా.. యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు అహ్మద్ మసూద్.
- చాలా మంది ప్రజలు, సైనికులు తమతో కలిశారని.. తాలిబన్లు దాడి చేయాలని చూస్తే వారికి భారీ నష్టం తప్పదని హెచ్చరించారు.
''1980ల్లో మేం సోవియట్ యూనియన్నే ఎదుర్కొన్నాం. ఇప్పుడు.. తాలిబన్లను ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు.''
- అల్ అరేబియా న్యూస్ ఛానల్‌తో అహ్మద్ మసూద్
- తన తండ్రి.. భారీగా ఆయుధాలు, మందుగుండు తయారుచేశారని, అవి ఇప్పుడు తమకు ఉపయోగపడతాయని చెప్పారు. తాలిబన్ల రాకతో.. తమ ప్రాంతానికి వందలాది ప్రజలు, సైనికులు వచ్చారని.. వారు కూడా యుద్ధానికి సిద్ధమని మసూద్ వెల్లడించారు.
- అఫ్గాన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొంటే.. తన తండ్రిని చంపిన తాలిబన్లను క్షమించడానికి సిద్ధమని మసూద్ చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో చర్చలకు ఆస్కారం ఉందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ నిపుణులు.
- అఫ్గానిస్థాన్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే కూడా మసూద్‌తో కలిశారు. తాలిబన్లను ఎదుర్కొనేందుకు వ్యూహాలు పన్నుతున్నారు.
- అయితే.. పంజ్‌షేర్ వైపు వెళ్లిన తాలిబన్లపై అక్కడి బలగాలు తిరుగుబాటు చేశాయని వార్తలొస్తున్నాయి.
- తాలిబన్లు, ఆల్‌ఖైదా ముష్కరులు (AL qaeda) కలిసి నకిలీ విలేకరుల వేషంలో.. ఆత్మాహుతి దాడి జరిపి 2001 సెప్టెంబర్ 9న అహ్మద్ షా మసూద్‌ను పొట్టనపెట్టుకున్నారు. అప్పటినుంచి ఆ ప్రాంతాన్ని ముందుండి నడిపిస్తున్నారు ఆయన తనయుడు అహ్మద్ మసూద్.
ఇవీ చూడండి: Afghanistan Taliban: మాదకద్రవ్య కర్మాగారంగా అఫ్గాన్