టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, నటి అతియాశెట్టి మూడు రోజుల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ నూతన జంటకు అభినందనలు తెలుపుతూ బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లు సైతం రూ. కోట్ల విలువైన బహుమతులను అందించినట్లు ఇటీవల పలు పత్రికల్లో పలు కథనాలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ఆయా వార్తలపై తాజాగా నటి అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి బృందం స్పందించింది. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. సరైన సమాచారం లేకుండా ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు తమని సంప్రదించాలని కోరింది.
కాగా రాహుల్ - అతియా జంట కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. 2021లో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టిన ఈ జంట ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో జనవరి 23న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. మహారాష్ట్రలోని ఖండాలాలో అతియాశెట్టి తండ్రి సునీల్ శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇరు కుటుంబాలతో పాటు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే వీరి పెళ్లి కానుకగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రూ.1.64కోట్ల విలువ చేసే ఆడీ కారు, జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్, విరాట్ కోహ్లీ, ధోనీలు డైమండ్ హారం, బైక్, కారు బహుమతులుగా పంపించారని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సునీల్‌శెట్టి బృందం ఆయా కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్నీ వదంతులు మాత్రమేనని స్పష్టం చేసింది.