రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ రావటంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి చిత్ర బృందం శుభవార్త వినిపించింది. నవంబరు 4 నుంచి ఈ సినిమా 'డిస్నీ+ హాట్‌స్టార్'లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించింది. ఏయే భాషల్లో అందుబాటులో ఉంటుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.
కథేంటంటే: సకల అస్త్రాలకు అధిపతి బ్రహాస్త్రం. బ్రహ్మాస్త్రంలోని ఒక భాగం మోహన్ భార్గవ్ (షారుఖ్ ఖాన్) అనే సైంటిస్ట్ దగ్గర ఉండగా.. రెండో భాగం అనీష్ (నాగార్జున) అనే ఆర్టిస్ట్ దగ్గర ఉంటుంది. మూడో భాగం ఎక్కడుందన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ మూడు భాగాలను వెతికి పట్టుకొని.. వాటిని ఒక్కటి చేసి.. ఆ బ్రహ్మాస్త్రం శక్తితో ప్రపంచాన్ని శాసించాలని ప్రయత్నిస్తుంటుంది జునూన్ బృందం (మౌనీరాయ్). బ్రహ్మాస్త్రాన్ని దక్కించుకునేందుకు ఈ బృందం చేసే ప్రయత్నాలకు డీజే శివ (రణ్‌బీర్ కపూర్) అడ్డుతగులుతాడు. మరి ఇతనెవరు? బ్రహ్మాస్త్రానికి అతనికీ ఉన్న సంబంధం ఏంటి? అతనిలో దాగున్న అగ్ని అస్త్రం వెనకున్న కథేంటి? బ్రహ్మాస్త్రంలోని మూడో భాగం ఎవరి దగ్గర ఉంది? దేవ్ బృందం బారి నుంచి బ్రహ్మాస్త్రాన్ని కాపాడేందుకు శివ ఎలాంటి సాహసాలు చేశాడు? ఈ కథలో గురు (అమితాబ్ బచ్చన్) పాత్రేంటి? అన్నది ఆసక్తికరం.
బ్రహ్మాస్త్ర-2 కోసం రంగంలోకి డిస్నీ..
ఓ సినిమాని విడుదలకు ముందే రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తుంటారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా రెండో భాగంవైపు అడుగులేస్తుంటాయి చిత్రబృందాలు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బ్రహ్మాస్త్ర' చిత్రానికి కూడా రెండో భాగం ఉంటుందనే ముందే చెప్పాయి చిత్రవర్గాలు. ఈ సినిమా డిస్నీ సంస్థకు బాగా నచ్చిందట. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన విధానం వాళ్లను బాగా ఆకట్టుకోవడంతో 'బ్రహ్మాస్త్ర-2'కి బడ్జెట్ కేటాయించడానికి ఆ సంస్థ ముందుకొచ్చినట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. 'బ్రహ్మాస్త్ర'ను అయాన్ ముఖర్జీ తీర్చిదిద్దిన విధానం డిస్నీ సంస్థకు నచ్చింది. దీన్ని ఓ ఫ్రాంఛైజీగా చేస్తే బాగుంటుందని ఆ సంస్థ భావిస్తోంది. అందుకోసం చిత్ర నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది’’అని కరణ్‌జోహార్ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సమాచారం. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది.