అఖండ సినిమా అద్భుత విజయం తర్వాత టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ.. మంచి జోష్ మీద ఉన్నారు. ఇటీవలే వీరసింహారెండ్డి చిత్రంతో థియేటర్లలో సందడి చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా తీస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నెట్టింట ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ కోసం బాలయ్య భారీ ట్రీట్ రెడీ చేస్తున్నారట.
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆ కాంబోలో మూవీ కోసం ఫ్యాన్స్ మళ్లీ రావాలని ఎదురుచూస్తుంటారు. అంతే కాదు ఆ కాంబోలో సినిమా వస్తుందంటే వసూళ్ల సునామీ బాక్సాఫీస్‌ను ముంచెత్తినట్టే. ఇక టాలీవుడ్లో అలాంటి కాంబినేషన్ అంటే వెంటనే గుర్తుకువచ్చేది బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబో. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు తెరకెక్కిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. బాలయ్యకు కెరీర్ బెస్ట్ కలెక్షన్‌లు తెచ్చిపెట్టిన సినిమాలు కూడా ఇవే.
సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్‌బస్టర్ల్ హిట్ల తరువాత వీళ్లిద్దరి కాంబినేషన్లో మరో సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాను బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజింగ్ గిఫ్ట్‌గా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బోయపాటి.. హీరో రామ్ పోతినేనితో యాక్షన్ సినిమా చేస్తున్నారు. అటు బాలయ్య కూడా అనిల్ రావిపూడితో సినిమా షూటింగ్లో బిజీలో ఉన్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తరువాత వీరి సినిమాపై ప్రకటన వస్తుందంటున్నారు నెటిజన్లు.
మే నెల కల్లా బోయపాటి-రామ్ సినిమా షూటింగ్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. అటువైపు బాలయ్య- అనిల్ సినిమా కూడా జూన్ కల్లా షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉండగానే.. బోయపాటి సినిమా స్టార్ట్ చేస్తారట బాలయ్య. మరి బాలయ్య-బోయపాటి సినిమాకు నిర్మాత ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు.
మైత్రీ మూవీస్‌తో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తారా? లేక బోయపాటికి అత్యంత సన్నిహితుడైన మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరో విషయం ఏంటంటే.. బాలయ్య పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సితార సంస్థల్లో కూడా సినిమా చేస్తానని సైన్ చేశారట. మరి బోయపాటి- బాలయ్య కాంబోను ఏ నిర్మాత తెరకెక్కిస్తారో చూడాలి.