Young Man Committed Suicide : పోలీసులు వేధిస్తున్నారని ఓ యువకుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. తనకు సంబంధం లేని విషయంలో పోలీసులు వేధించారని మృతుడు సూసైడ్ నోట్లో తెలిపాడు. తనపై రవి అనే వ్యక్తి ఫిర్యాదు కారణంగా పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని సూసైడ్ నోట్లో తెలిపాడు.
మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం జక్కంశెట్టి వారి పాలెంకు చెందిన నాగబాబు అనే యువకుడు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో.. ఆచంట పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లారని అన్నారు. విచారణలో భాగంగా పోలీసులు అతనిపై దురుసుగా ప్రవర్తించారని వివరించారు. రవి అనే వ్యక్తి కారణంగా పోలీసులు ఇలా ప్రవర్తించారని అన్నారు. దీంతో ద్విచక్ర వాహనంపై, పెనుగొండ మండలం సిద్ధాంతం వద్దనున్న గోదావరి నది బ్రిడ్జి వద్దకు వెళ్లి.. నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని.. మంగళవారం నదిలో మృతదేహం లభ్యమైందని తెలిపారు. పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రవి అనే వ్యక్తి తనపై ఆచంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని మృతి చెందిన యువకుడు లేఖలో పేర్కొన్నాడు. రవి ఫిర్యాదు మేరకు తనకు సంబంధం లేకున్నా పోలీసులు వేధించారని మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. దీంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో వివరించాడు. వేధింపులకు కారణమైన రవిపై, వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ యువకుడు లేఖలో రాశాడు.
ఇవీ చదవండి :