Jubilee Hills Accident Case Update: హైదరాబాద్ జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సంతోశ్‌నగర్‌కు చెందిన అప్నాన్, మాజిద్‌లను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. డ్రైవింగ్ ఎవరు చేశారనే విషయం తెలుసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. అప్నాన్, మాజిద్‌తో పాటు.. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కూడా ఉన్నట్లు జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే తమ అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. రాహిల్ గురించి మాత్రం సమాచారం లేదని చెప్పారు.
గురువారం రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్, అతని ఇద్దరు స్నేహితులు కలిసి గచ్చిబౌలీలోని ఓ బేకరీకి... రాత్రి 7.30లకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడ అల్పాహారం తీసుకున్న తర్వాత దుర్గం చెరువు తీగల వంతెన మీదుగా ఫిల్మ్ నగర్ వైపు వెళ్లేందుకు బయల్దేరారు. అతివేగంగా వెళ్తున్న ఆ కారు.. జూబ్లీహిల్స్ రోడ్డు నెం 45లో డివైడర్ దాటేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు మహిళలను ఢీ కొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కారు ఎవరు నడిపారంటే..
Jubilee Hills Accident Case : వాహనం ఎవరు నడిపారనే విషయంలో పోలీసులు నిర్ధారణకు రాలేదు. తానే వాహనం నడిపినట్లు మాజిద్ అనే యువకుడు పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలం వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో.. డ్రైవింగ్ ఎవరు చేశారనే విషయాన్ని పోలీసులు తేల్చలేకపోతున్నారు. వాహనం మిర్జా ఇన్ ఫ్రా పేరుతో రిజిస్టరై ఉంది. వాహనంపైన బోధన్ ఎమ్మెల్యే షకీర్ పేరుతో స్టిక్కర్ ఉంది.