కర్నూలు జిల్లా: ఆదోని ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బంధమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన చేపట్టారు. డ్యూటీ వైద్యులు సాయి సుధ, అది నగేష్ చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యంతో ఆందోళన విరమించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు. ఆగిఉన్న లారీపై నంద్యాల జిల్లా గడివేముల గ్రామానికి చెందిన అబ్రహం అనే లారీ డ్రైవర్ నిద్రించాడు. నిద్రమత్తులో పైకి లేవగా... పైన ఉన్న కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘణనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా: వై.రామవరం మండలం డి.మామిడివాడ ఘాట్‌రోడ్డులో వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మామిడివాడ నుంచి దారకొండ గ్రామానికి ఆధార్ కార్డులకు ఫోన్ నెంబర్లు అనుసంధానం చేసేందుకు వ్యాన్‌లో 30 మంది బయలుదేరారు. దారకొండ సమీపంలో ఘాట్ రోడ్డు వద్ద బ్రేకులు ఫెయిల్ అయి వ్యాను బోల్తా పడింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
నంద్యాల జిల్లా: నంద్యాలలో అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల బియ్యాన్ని మూడో పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో లారీలో తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. లారీ డ్రైవర్, బియ్యం వ్యాపారి గుమస్తాలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రానికి తరలించి అక్కడ సొమ్ము చేసుకుంటారని డీఎస్పీ అన్నారు. ఇందులో నంద్యాలకు చెందిన మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా: బాపట్ల కొత్తబస్ స్టాండ్ సమీపంలో ఎదురెదురుగా వచ్చిన స్కూటీ, ద్విచక్రవాహనం బలంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులకు తీవ్రగాయాలు కాగా... బైకుపై వస్తున్న ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను బాపట్లలో ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లా: సంచలనం సృష్టించిన గోవా మద్యం కేసులో మరో నిందితుడిని సెబ్ అధికారులు అరెస్టు చేశారు. గత నెలలో గోవాకు చెందిన మద్యం బాటిళ్లు నెల్లూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో పట్టుబడ్డాయి. దాదాపు 18వేల మద్యం బాటిల్ పట్టుకున్న పోలీసులు... ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. గోవా మద్యం సరఫరా చేసిన నిందితుడు వనవిధిత్ డిసోజాను నవోలి పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. వనవిధిత్ డిసోజా తన సోదరుడు మైఖేల్ డిసోజాతో కలిసి గోవా మద్యం బాటిళ్లను తారు ట్యాంకర్ ద్వారా నెల్లూరుకు రవాణా చేసినట్లు నెల్లూరు సెబ్ అదనపు సూపరింటెండెంట్ క్రిష్ణ కిషోర్ తెలిపారు.
పల్నాడు జిల్లా: విజయపురిసౌత్‌లో లారీ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. దర్శికి చెందిన డ్రైవర్ కృష్ణారెడ్డి, క్లినర్ నారాయణ వినుకొండ నుంచి హైదరాబాద్‌కు ఇనుము లోడుతో వెళ్తున్నారు. సాగర్ బ్రిడ్జి వద్దకు రాగానే ముందు టైర్ పేలడంతో లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లినర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ క్యాబిన్ మృతదేహాలు ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేటలోని హోండా షోరూమ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.5 లక్షలు, ఒక హార్డ్ డిస్క్ అపహరించారు. షోరూమ్ యజమాని ఫిర్యాదు చేయగా... ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కృష్ణ జిల్లా: గన్నవరం గాంధీబొమ్మ కూడలిలో వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం-ట్రక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కైకలూరుకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రక్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏలూరు జిల్లా: నూజివీడు మండలం పొలసనపల్లి గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 1200 లీటర్ల బెల్లపు ఊట, 15 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు. నలుగురిని అరెస్టు చేసి... కేసు నమోదు చేశారు.
* చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. 2100 లీటర్ల బెల్లపుఊట ధ్వంసం చేశారు. 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారిదారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
అనంతపురం జిల్లా: శింగనమల మండలం నాయనవారిపల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు చీని చెట్లను నరికేశారు. తెదేపాకు చెందిన గుర్రం లక్ష్మీనారాయణకు చెందిన 20 చీని చెట్లును, బోయ సుశీలప్పకు చెందిన 130 చీని చెట్లు గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: కలిగిరి మండలం కుమ్మరకొండూరు గ్రామంలో మహిళపై బంధువు దాడి చేశాడు. చల్లా సుబ్బరత్నమ్మ అనే మహిళపై రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆమె బంధువైన చల్లా మహేష్ దాడికి పాల్పడ్డాడు. ఇరువురి మధ్య పొలం వివాదం సాగుతోంది. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. రాత్రికిరాత్రి పొలంలోని చెట్లను జేసీబీతో మహేష్ తొలగించేందుకు ప్రయత్నించగా... సుబరత్నమ్మ అడ్డున్నారు. ఆ క్రమంలో ఆమెపై మహేష్ కుటుంబం దాడికి దిగింది. డయల్ 100 కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తనను హత్య చేసేందుకు మహేష్ దాడి చేశాడని సుబరత్నమ్మ ఆరోపించింది. కావలి ఏరియా ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది.
విజయనగరం జిల్లా: గుర్ల మండలం చుక్కపేట జంక్షన్లో ఆగిఉన్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రయాణికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
గుంటూరు జిల్లా :తుళ్లూరు మండలం మందడం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై తోటి విద్యార్థి కత్తితో దాడి యత్నించిగా.. ఉపాధ్యాయడు సహాయంతో తృటిలో తప్పించుకుంది. గతంలో విద్యార్థి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, సిగరెట్లు తాగుతున్నారని బాలిక ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది. దీనిని మనస్సులో పెట్టుకున్న బాలుడు శుక్రవారం మధ్యాహ్నం కత్తితో వెంబడించాడు. ఘటనపై బాలిక తల్లిదండ్రులు వచ్చి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఘటనపై ఎస్సై వెంకట రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడిపై ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: Cryptocurrency: ఆశపడి అరసెకను ఆలోచించావా.. అంతే..