Students Died in Musi Lake: ఆదివారం ఆటవిడుపుగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వీరి ఈత సరదా మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం. నిడమనూరు గ్రామానికి చెందిన పిడుగురాళ్ల వాసు(15), చెంచు మహేశ్(13), లింగతోటి జగన్( 12) స్నేహితులు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో... పొందూరు సమీపంలోని మూసీ వాగు వద్దకు వెళ్లారు. సరదాగా కొంత సేపు క్రికెట్ ఆడారు. ఆ తరువాత కాస్త ఉపశమనం కోసం వాగులో ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. ఇసుక కోసం తవ్విన గోతుల్లో చిక్కుకొని మునిగిపోయారు.
పిల్లలు నిన్న రాత్రంతా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళనతో వెతకడం ప్రారంభించారు. ఉదయం మూసీ వాగు నీటి గుంటల్లో వీరి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. రాష్ట్రంలో నిత్యం ఏదో చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉండగా.. నదులు, వాగులు, చెరువులు, కుంటల్లో ఇసుక తవ్విన చోట.. హెచ్చరిక బోర్డులను పెట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: