Illegal Weapons: కారణాలేవైనా అక్రమ ఆయుధాలు సమకూర్చుకునే వారి సంఖ్య తెలంగాణలో పెరుగుతోంది. తుపాకులు పేలే వరకూ ఈ విషయం పోలీసులకూ తెలియడంలేదు. ఆయుధాలకు డిమాండు పెరగడంతో ఉత్తరాది నుంచి వాటిని సరఫరా చేసే ముఠాలు తయారయ్యాయి. ఒకప్పుడు ఉత్తరాది నుంచి దిల్లీ, ముంబయిలకు ఆయుధాల రవాణా ఎక్కువగా జరిగేదని, ఇప్పుడు క్రమంగా హైదరాబాద్‌కు సరఫరా అవుతున్నాయని అధికారులే అంగీకరిస్తున్నారు. సాధారణంగా కాల్పులు జరిపినప్పుడే అక్రమ ఆయుధాల విషయం వెలుగులోకి వస్తుంది. బయట పడనివి పెద్దసంఖ్యలో ఉంటాయని పోలీసుల అంచనా.
జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం గతేడాది రాష్ట్రంలో 73 అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అంటే సగటున అయిదు రోజులకు ఒక ఆయుధం పట్టుబడిందన్నమాట. ఈ ఏడాది వీటి సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొంత కాలంగా ఉత్తరాది నుంచి వలసలు పెరగడంతో ఆయుధాలు తెప్పించుకోవడం సులభమవుతోంది. ఇటీవల జరిగిన ఇబ్రహీంపట్నం జంట హత్యల కేసులో ఆయుధాలను ఉత్తరాది నుంచి(బిహార్) పనుల కోసం హైదరాబాద్ వస్తున్న వారితో తెప్పించుకున్నారు. సిద్దిపేట సమీపంలోని తోగుట్ట వద్ద మార్చిలో జరిగిన కాల్పుల్లో తిరుపతి అనే వ్యక్తి కూలిపని కోసం వచ్చిన ఉత్తర్‌ప్రదేశ్ వాసితో స్నేహంచేసి ఆయుధాన్ని సమకూర్చుకున్నాడు.
భూముల ధరలు విపరీతంగా పెరగడంతో.. రాష్ట్రంలో భూముల ధరలు, డబ్బు లావాదేవీలు విపరీతంగా పెరుగుతుండటంతో ఆత్మరక్షణ కోసం చాలామంది వ్యాపారులు తుపాకీ లైసెన్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. దాంతో అక్రమ ఆయుధాల కోసం ప్రయత్నించే వారి సంఖ్య పెరిగిందని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 1న ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యలకు కారణం స్థిరాస్తి వివాదాలు. గత నవంబరులో తిరుమలగిరి స్టేషన్ పరిధిలో జరిగిన హత్యకు రియల్‌ఎస్టేట్ కమిషన్ గొడవలే కారణం. గత ఏడాది సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద భూమి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వ్యక్తిపై ఇద్దరు యువకులు కాల్పులు జరిపి రూ.43.5 లక్షలు దోపిడీ చేశారు. ఈ కేసులో నిందితులు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దుల్లో పిస్తోలు, బుల్లెట్లు కొనుగోలు చేసినట్లు పోలీసు అధికారులు గుర్తించారు.
ఖరీదు రూ.30వేలు.. ఒకప్పుడు సాదాసీదా దేశవాళీ పిస్తోళ్లు మాత్రమే దొరికేవి. వీటిలో ఒక్కో బుల్లెట్ పెట్టి పేల్చాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక్కో దాన్లో 14 బుల్లెట్ల వరకు పట్టే మేగజైన్‌లు కూడా వచ్చాయి. వీటి ధర రూ.30 వేల వరకూ ఉంటుంది. మామూలు దేశవాళీ తపంచాలు రూ.5 వేలకూ లభిస్తున్నాయి.
ఈ రాష్ట్రాలు అక్రమ ఆయుధాగారాలు.. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అక్రమ ఆయుధాల తయారీకి కేంద్రాలుగా మారాయి. బిహార్‌లోని ముంగేర్ జిల్లాలో గత ఏడాది జూన్‌లో ఏడు ఆయుధ కర్మాగారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్, శామిలి.. మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతాలు అక్రమ తుపాకుల తయారీకి అడ్డాలు.