రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన తాడేపల్లి సీతానగరం అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిందితుల కోసం పోలీసులు దాదాపు మూడు నెలలుగా 13 జిల్లాలోనూ విస్తృతంగా గాలించారు. ప్రధాన నిందితుడు కృష్ణ కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పట్టారు. అత్యాచారం కేసులో నిందితులుగా అనుమానిస్తున్న కృష్ణ, వెంకటరెడ్డిలకు చెందిన వ్యక్తులు, బంధువులను, స్నేహితులను రెండు నెలలుగా విచారిస్తున్నారు.
వారు ఇచ్చిన సమాచారం మేరకు నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 10 బృందాలతో గాలింపు చేపట్టారు. చివరకు ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కృష్ణ ఒంగోలులో ఉన్నట్లు తెలిసింది. 10 రోజులుగా గాలింపు చేపట్టిన పోలీసులు మారు వేషాలలో సంచరించారు. చివరికి ఓ ప్లైవోవర్ కింద బిచ్చగాళ్లతో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాత్రికి రాత్రే గుంటూరు తీసుకొచ్చి ఓ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడి నుంచి పూర్తి సమాచారం రాబట్టిన తర్వాత ఈ రోజు లేదా రేపు పోలీసులు అధికారికంగా అరెస్టు చూపించే అవకాశం కనిపిస్తోంది.