SUICIDE ATTEMPT: వ్యవసాయం కలిసిరాక చేసిన అప్పులు తీరవేమోనన్న భయంతో కౌలు రైతు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పురుగులమందు తాగడంతో భర్త మృతి చెందగా భార్య కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం వంకాయలపాడులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాలినేని వినోద్ కుమార్‌రెడ్డి(40) కుటుంబం చిన్న హోటల్ నడుపుతోంది. కుటుంబం గడవటం కష్టంగా ఉండటంతో నాలుగేళ్లుగా నాలుగెకరాలు కౌలు భూమి సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడాది మిరప వేయగా అధిక వర్షాలతో పూర్తిగా దెబ్బతింది.
పైరు పీకేసి, రెండో పంటగా శనగ వేశారు. అందులోనూ పెట్టుబడి రాని పరిస్థితి. నాలుగేళ్లలో చేసిన అప్పు రూ.16 లక్షల వరకు పెరిగిపోయాయి. దీంతో 3 సెంట్ల స్థలాన్ని అమ్మి కొంత బాకీ తీర్చాడు. ఇద్దరు పిల్లల చదువు, కుటుంబ పోషణ భారంగా మారింది. చేసిన అప్పులు తీరవన్న వేదనతో ఆదివారం ఉదయం వినోద్ తన భార్య అపర్ణప్రియతో కలిసి పురుగుమందు తాగారు. వీరి ఇల్లు గ్రామానికి చివర ఉన్నందున ఎవరూ గమనించలేదు. 10 గంటల సమయంలో బంధువులు గమనించి ఇద్దర్నీ ఇడుపులపాడు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా వినోద్‌కుమార్‌రెడ్డి మృతి చెందారు. అపర్ణ మృత్యువుతో పోరాడుతోంది. వినోద్‌కుమార్‌రెడ్డికి కౌలు రైతు కార్డులేక పంట నష్టపరిహారం అందలేదు. ఇటీవల ప్రకటించిన పంటల బీమా పథకంలోనూ పరిహారం అందలేదని బంధువులు తెలిపారు.
కౌలుకు తీసుకుని.. అప్పుల పాలై
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన రైతు దమ్ము అచ్చెయ్య (39) వ్యవసాయం కారణంగా అప్పులపాలై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అచ్చెయ్య తనకున్న 80 సెంట్ల పొలంతో పాటు మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. గత మూడేళ్లుగా పంట దిగుబడి సక్రమంగా రాక, వచ్చిన దానికి ధర లభించక సుమారు రూ.10 లక్షలు అప్పులయ్యాయి. వాటిని తీర్చడానికి తన 80 సెంట్ల పొలాన్ని అమ్ముదామన్నా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పులిచ్చిన వారు డబ్బులు అడుగుతుండటంతో వాటిని తీర్చలేమన్న మనోవేదనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మల్లిక ఫిర్యాదు మేరకు ఎస్సై కె.అమీర్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అచ్చెయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవీ చదవండి: