Road accident at domadugu: ఒకటే వాహనం.. ఒకటే స్థలం.. ఒకే రకమైన ప్రమాదాలు.. ఒక రోజులోనే ఆ కుటుంబంలోంచి ఇద్దరిని దూరం చేసింది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి ద్వి చక్రవాహనంపై ఇద్దరు పిల్లలతో కలిసి ఆ దంపతులు సంతోషంగా బయలుదేరారు. మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుతారు. ఇంతలో అనుకోని ఘటన.. ఒక్కసారిగా బండి అదుపుతప్పింది. ఏం జరిగిందో తెలుసుకునే సరికి నలుగురూ చెల్లాచెదురుగా పడిపోయారు. కానీ దెబ్బలు పెద్దగా తగలలేదు. వెంటనే సమీప ఆస్పత్రికి చేరుకుని ప్రథమ చికిత్స చేయించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శుభకార్యానికి వెళ్లడం సబబు అనిపించలేదు వాళ్లకు. అందుకే అదే బండిపై తిరుగు ప్రయాణమయ్యారు. కానీ మృత్యువు మాత్రం వెనక్కి తగ్గలేదు. యమపాశం మళ్లీ వారిపై విజృంభించింది. మొదట జరిగిన ప్రమాదం మాదిరిగానే ఈ సారి కూడా బండి అదుపు తప్పి.. ఏకంగా డివైడర్ను ఢీ కొట్టింది. వారి కుటుంబంలో తల్లీకుమార్తె ప్రాణాల్ని బలితీసుకుంది. మరో ఇద్దరిని ఆస్పత్రి పాలు చేసింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు పరిధిలో ఆదివారం జరిగిన ప్రమాదం తాలూకు సంఘటనలివి. ఇదంతా కేవలం గంటల వ్యవధిలోనే చోటుచేసుకుంది.
![](https://assets.eenadu.net/article_img/gh-crime3a_79.jpg)
గుమ్మడిదలకు చెందిన కమ్మరి బ్రహ్మచారి(32), ఆయన భార్య కల్పన(25), కుమార్తె కృతిక శివాని(4), కుమారుడు కార్తీక్(2)లు.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ శివారులోని బొల్లారంలో ఓ శుభకార్యానికి బయలుదేరారు. దోమడుగులో వీరి వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. స్వల్ప గాయాలు కావడంతో తేరుకుని సమీపంలోని అన్నారం ప్రాథమిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అనంతరం శుభకార్యానికి వెళ్లకుండా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మళ్లీ దోమడుగు పరిధికి రాగానే ఓ మలుపు వద్ద ద్విచక్ర వాహనం రెండోసారి అదుపు తప్పి విభాగినిని బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న నలుగురు రోడ్డుపై ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మధ్యలో కల్పన, కృతికశివాని మృతి చెందారు. బ్రహ్మచారి, కుమారుడు కార్తీక్ పరిస్థితి విషమంగా ఉండటంతో సూరారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి: FIRE IN TRACTOR MANTYALAYAM : పశుగ్రాసంతో వెళ్తున్న ట్రాక్టర్కు మంటలు...తప్పిన ప్రమాదం