Three Died in Car Accident at East Godavari: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం కల్లేరు వద్ద కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వరరామచంద్రాపురం మండలం పెద్దమట్టపల్లికి చెందిన ప్రభుత్వ టీచర్ సత్యనారాయణమూర్తి.. పలువురు గ్రామస్తులతో కలసి కారులో సరదాగా ఒడిశాలోని మోటుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కల్లేరు వద్ద జాతీయ రహదారిపై కల్వర్టును కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో పెద్దమట్టపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చెట్టుని ఢీకొట్టిన బైకు.. ముగ్గురు దుర్మరణం: విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం మర్రివలస జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. యువకులు ద్విచక్రవాహనంపై విజయనగరం జిల్లా గొట్లాంలో జరిగిన నూకాలమ్మ జాతరకు వెళ్లి వస్తున్నారు. మర్రివలస జంక్షన్ వద్ద బైకు అదపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
మృతులు విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం దాసులపాలెం గ్రామానికి చెందిన కూనిశెట్టి త్రినాథ్(20), ఎస్. కోట మండలం జామి గ్రామానికి చెందిన ఎర్ర సాయి(18), విశాఖ జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన కొట్యాడ మణికంఠ(23)గా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కె.కోటపాడు ఎస్ఐ గోపాలరావు చెప్పారు.
RTC Bus Overturns in Prakasam District: ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల సమీపంలో ఆర్డీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా బణగానిపల్లె డిపోకు చెందిన బస్సు.. 55 మంది ప్రయాణికులతో శ్రీశైలం నుంచి దోర్నాల వెళ్తుంది. చింతల గ్రామం వద్దకు రాగానే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో ముందు వెళ్తున్న బొలెరో వాహనంతోపాటు పక్కనే ఉన్న కొండను ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులకు దోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించారు.
ఇదీ చదవండి: బైక్ ర్యాలీపై రాళ్ల దాడి.. 35 మందికి గాయాలు.. కర్ఫ్యూ విధింపు