Remand prisoner suicide: చిత్తూరు జిల్లా జైల్లో బుధవారం రోజు రిమాండ్ ఖైదీ ప్రవీణ్‌కుమార్(26) ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం రాళ్లపుట్టు గ్రామానికి చెందిన రాధాకృష్ణ కుమారుడు ప్రవీణ్‌కుమార్ ఆటోడ్రైవర్. గతేడాది ఆగస్టు ఒకటో తేదీన తిరుపతిలో గంజాయి అక్రమ రవాణా కేసులో తిరుపతిలోని ఎస్వీయూ స్టేషన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అప్పట్లో తిరుపతి జైలులో ఉంచి ఆపై అదే నెల 12న చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. ఇటీవల అతడి కుటుంబ సభ్యులు బెయిల్ కోసం ప్రయత్నించగా రద్దయినట్లు తెలిసింది.
అప్పటినుంచి వారు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై పలుమార్లు తోటి ఖైదీలతో చెప్పి బాధపడ్డాడని జైలు అధికారులు తెలిపారు. మధ్యాహ్న సమయంలో మరుగుదొడ్డికి వెళ్లి అక్కడి కిటికీ కమ్మీలకు లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. రెండో పట్టణ సీఐ యుగంధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
డబ్బులు లేక.. ఏం చేయాలో దిక్కుతోచక..
మృతదేహం తరలించేందుకు తిరుపతి వరకు అంబులెన్స్ ఇస్తామని.. అక్కడనుంచి తీసుకెళ్లాలని పోలీసులు.. కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే డబ్బులు లేని పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. పాడేరు ఏఎస్పీ జగదీష్ దృష్టికి విషయం తీసుకెళ్లగా.. మృతదేహం తీసుకువచ్చేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. గిరిజన యువత ఉపాధి మార్గాలు లేక..చాలామంది చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతూ జైల్లో మగ్గుతూ.. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని పలువురంటున్నారు.
ఇదీ చదవండి:
'వాళ్లు ఆగం చేశారు.. ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా'