prisoners release: స్వాంతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్టవ్యాప్తంగా 175 మంది ఖైదీలు విడుదలవుతుండగా.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి 66 మంది ఖైదీలకు విముక్తి లభించింది. వీరిలో 55 మంది పురుషులు ఉండగా.. 11 మంది మహిళలు ఉన్నారు. 48 మంది జీవిత ఖైదు సహా ఇతర శిక్షలుపడిన వారిని ప్రభుత్వం విడుదల చేసింది. విశాఖ కేంద్ర కారాగారం నుంచి 40 మందిని విడుదల చేశారు.వీరిలో 33 మంది జీవిత ఖైదీలు ఉన్నారు. బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా.. ఉపశమనాన్ని రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి 26 మంది జీవిత శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విడుదలతోపాటూ ఓ జీవితేతర ఖైదీని పెరోల్‌పై వదిలేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఇద్దరు ఖైదీలపై ఇతర కేసులు ఉండటంతో వారిని మినహాయించి 24 మంది ఖైదీలను విడుదల చేశారు. నెల్లూరు కారాగారానికి చెందిన ఓ ఖైదీ కేరళ జైల్లో ఉండటంతో అతనిని అక్కడినుంచే విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన ఖైదీలు కుటుంబ సభ్యులను కలుసుకొని ఆనందాన్ని పంచుకున్నారు. క్షణికావేశానికి తమ జీవితమే బలైపోయిందని పలువురు ఖైదీలు ఆవేదన వ్యక్తం చేశారు. 200 రూపాయల విలువచేసే మద్యం వల్ల.. తన 13ఎళ్ల జీవితం జైలు పాలైందని ఓ ఖైదీ ఆవేదన తెలిపాడు. ఎక్కువగా మద్యం మత్తులోనే నేరాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారని చెప్పారు. జైల్లో సౌకర్యాలు బాగానే ఉన్నా.. కుటుంబాలకు దూరంగా ఉండటం నరకప్రాయమన్నారు. ఇకపై సమాజంలో తామంతా సత్ప్రవర్తనతో జీవిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: