WOMAN MISSING CASE : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సంవత్సరం క్రితం చెదల కాంతమ్మ అనే మహిళ మిస్సింగ్ మిస్టరీ వీడింది. కాంతమ్మను కాబోయో భర్తే హత్య చేశాడాని తేల్చారు. కేసు వివరాలను చింతపల్లి ఏఎస్‌పీ కె.ప్రశాంత్ శివ కిషోర్ మీడియాకి వెల్లడించారు. చింతపల్లి మండలం సంపంగిపుట్టు గ్రామానికి చెందిన చెదల కాంతమ్మకు.. అదే గ్రామానికి చెందిన వండలం గోపాల్‌తో 2021లో నిశ్చితార్థం జరిగింది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే నిశ్చితార్థం జరిగిన గోపాల్.. చిట్టంపుట్టు గ్రామానికి చెందిన కోరాబు లక్ష్మితో గత 5సంవత్సరాలుగా ప్రేమాయణం నడిపిస్తున్నాడు. సహజంగా పెళ్లి కుదిరితే మాట్లాడుకోవడం, సన్నిహితంగా ఉండడం లాంటివి కామన్.. అయితే దీనిని జీర్ణించుకోలేని ప్రేయసి లక్ష్మి.. ప్రియుడు గోపాల్‌పై ఒత్తిడి తెచ్చింది. 'నన్ను ప్రేమించి.. కాంతమ్మను ఎలా పెళ్లి చేసుకుంటావు.. నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా' అని బెదిరించింది. దీంతో ఖంగుతున్న గోపాల్ దారిలోకి వచ్చాడు.
మనం కలిసి మెలిసి ఉండాలంటే కాంతమ్మను అడ్డు తొలగించాలని చిన్నగా గోపాల్‌కు నూరిపోసింది. మరి హత్య చేయాలంటే బహిరంగంగా చేయరు కదా.. అందుకోసం వినాయకచవితి పండుగను ఎంచుకున్నారు. అప్పుడైతే అందరూ హడావిడిలో ఉంటారు.. కాబట్టి ప్లాన్ పక్కాగా అమలు పర్చవచ్చునని గోపాల్‌కు వివరించింది. ఐడియా బాగుందని నమ్మిన గోపాల్.. అమలుచేయడానికి సిద్ధమయ్యాడు.
ఇందులో భాగంగానే గత ఏడాది సెప్టెంబర్ 10న లక్ష్మి.. చెదల కాంతమ్మ ఇంటికి వెళ్లి గోపాల్‌ను పెళ్లి చేసుకో, నేను మీ మధ్య ఉండనని ఆమెతో నమ్మబలికింది. తనను ఇంటి వద్ద దిగబెట్టమని లక్ష్మి కోరడంతో.. కాంతమ్మ తనని ఇంటివరకూ దిగబెట్టింది. ఆ సమయంలో లక్ష్మి ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో లోనికి తీసుకెళ్లి కాంతమ్మను మాటల్లో పెట్టి.. గొడ్డలితో తలమీద కొట్టింది. కాంతమ్మ అరుపులు విని.. ఇంటి బయట కాపలాగా ఉన్న గోపాల్ వెంటనే ఇంట్లోకి వెళ్లి నోరు, ముక్కును ఊపిరి ఆడకుండా నొక్కగా.. లక్ష్మి మరో దెబ్బ బలంగా వేయడంతో కాంతమ్మ అక్కడికక్కడే చనిపోయింది. అయితే శవం ఎవ్వరికీ దొరకకూడదని ప్లాన్ వేసిన ఇద్దరు.. లక్ష్మి వాళ్ల ఇంటికి ఆనుకోని ఉన్న దొడ్డిలో.. దుంపల కోసం తవ్విన గోతిని మరి కొంచెం తవ్వి కాంతమ్మ శవాన్ని రగ్గులో చుట్టి పూడ్చి పెట్టారు.
అయితే కాంతమ్మ కనిపించకపోవడంతో ఆమె తల్లికి లక్ష్మి మీద అనుమానం వచ్చింది. దీంతో అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లక్ష్మి, గోపాల్‌లు అనుమానస్పద ప్రవర్తనతో గ్రామ పెద్దలు పంచాయితి పెట్టగా.. పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకొని తిరుగుతున్నారు. ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్లుగా.. గోపాల్, లక్ష్మిల మీద అనుమానంతో.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విచారణ చేయగా అసలు విషయం బయటికి వచ్చింది. దీంతో నిందితులను అరెస్ట్ చేశాం" అని తెలిపారు. ఈ కేసు చేధించిన పోలీసులను ఏఎస్పీ అభినందించారు.
ఇవీ చదవండి: