అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 45 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ లారీ, కారును స్వాధీనం చేసుకున్నారు. సరుకు విలువ సుమారు 40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. 50 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
రాపూరు అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా, గూడూరు సమీపంలోని బూదనం టోల్ ప్లాజా వద్ద వీరిని సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన దాము, పాండిచ్చేరికి చెందిన పళని, వేలూరుకు చెందిన సుబ్రమణ్యంలు పైలెట్లుగా వ్యవహరిస్తూ, 55 మంది తమిళనాడు కూలీలను తీసుకువచ్చి రాపూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు నరికినట్లు చెప్పారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టగా తప్పించుకున్న వీరు.. ఎర్రచందనంతో పాటు వాహనాల్లో తమిళనాడు వైపు వెళుతుండగా జాతీయ రహదారిపై చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసులను చూసి వాహనాలను ఆపకుండా.. గొడ్డళ్లను సైతం విసిరినట్లు వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించి వీరి వెనకున్న ప్రధాన నిందితులను అరెస్టు చేస్తామన్నారు.
ఇదీ చూడండి
TDP Leaders arrest in Amaravathi : తెదేపా- వైకాపా శ్రేణుల సవాళ్లు...తెలుగు తమ్ముళ్ల అరెస్టులు...